
సింగం వర్సెస్ పుష్పా..బెంగాల్‌లో ఐపీఎస్ వివాదం
పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్‌కు ముందు ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ చర్యలు తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీశాయి. అల్లర్లు సృష్టించే వారిపై ‘తగిన చర్యలు తీసుకుంటాం’ అంటూ ఆయన హెచ్చరించడంతో, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈసీ నియమించిన పోలీస్ అబ్జర్వర్ తన అధికార పరిధిని మించారని ఆరోపించింది. దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ప్రభావిత ప్రాంతంలో శర్మ భారీ కేంద్ర బలగాలతో పర్యటించారు. సమస్య సృష్టించే అవకాశమున్న వ్యక్తుల జాబితాతో ఆయన రెండు రోజులపాటు తనిఖీలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ స్పందిస్తూ సినిమా శైలిలో వ్యాఖ్యానించారు. ‘ఇది బెంగాల్..అతను ‘సింగం’ అయితే, నేను ‘పుష్పా’. బీజేపీ నియమించిన అధికారుల బెదిరింపులు ఇక్కడ పనిచేయవని స్పష్టం చేశారు. అలాగే, బలగాలతో వచ్చి ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. అధికార వర్గాల ప్రకారం, ఓటరు గుర్తింపు కార్డులు సేకరిస్తూ బెదిరిస్తున్నారనే ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఆదేశాలతో శర్మ అక్కడికి వెళ్లారు. అయితే టీఎంసీ కార్యకర్తలు ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. వైరల్ వీడియోలో శర్మ ఎవరైనా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ కనిపించారు. జహంగీర్ ఖాన్ అనుచరులపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా, టీఎంసీ నేతలు పరిశీలకుడి చర్యలను తీవ్రంగా ఖండించారు. మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ, ఎన్నికల పరిశీలకులు కేవలం గమనించి నివేదించాల్సినవారే గానీ, హెచ్చరికలు ఇవ్వడం వారి బాధ్యత కాదని అన్నారు.
మరో మంత్రి అరూప్ బిస్వాస్ కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పిస్తూ ‘యుద్ధంలా వ్యవహరిస్తూ ఓటర్లను భయపెడుతున్నారు’ అని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సోషల్ మీడియాలో అధికారిపై వ్యంగ్యంగా స్పందించగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆయన్ని బీజేపీ ఏజెంట్‌గా విమర్శించారు. అయితే ఈ ఆరోపణలపై బీజేపీ ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించారు. ఎన్నికల సంఘం నియమించిన 95 మంది పరిశీలకుల్లో శర్మ ఒకరని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బెంగాల్ ఎన్నికల వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
