Let's talk: editor@tmv.in
పదవుల కోసం మౌనమా? లోకేశ్, పవన్‌పై ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శలు

పదవుల కోసం మౌనమా? లోకేశ్, పవన్‌పై ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శలు

Gaddamidi Naveen
13 జూన్, 2026

ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో విశాఖపట్నానికి చెందిన పట్నాల సురేష్ అనే తెలుగు నావికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై స్పందించకుండా మౌనంగా ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం తమ పదవులను కాపాడుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వానికి భయపడి వారు నోరు మెదపడం లేదని, నైతిక విలువలను పూర్తిగా విస్మరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు.

దేశం కోసం సేవ చేస్తూ అమెరికా దాడిలో తెలుగు బిడ్డ ప్రాణాలు కోల్పోతే, కనీసం ఆయన గౌరవార్థం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. అదే సమయంలో కొందరు నాయకులు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ ఫిట్‌నెస్, చర్మ సౌందర్య రహస్యాల గురించి చర్చలు జరుపుతున్నారని.. దీనిపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారని ఎద్దేవా చేశారు.

గతంలో ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రధాని మోడీ నాయకత్వాన్ని తాము ప్రశంసించామని, అయితే అనంతరం జరిగిన పరిణామాలపై కూడా స్పందించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ఇప్పుడు అమెరికా దాడులు చేసి ఇంతమంది భారతీయుల మరణానికి కారణమైనా, కేంద్ర మిత్రపక్షాలుగా ఉన్న ఏపీ నాయకులు నోరు విప్పకపోవడం శోచనీయమన్నారు. దేశ పౌరులు, తెలుగు వారి ప్రాణాల కంటే పదవులే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న వీరి వైఖరిని, ఈ అన్యాయమైన మౌనాన్ని ప్రజలు గమనిస్తున్నారని గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు.