Let's talk: editor@tmv.in
మహిళా, శిశు-గిరిజన సంక్షేమంలో రెండేళ్లలో గణనీయ పురోగతి: మంత్రి సంధ్యారాణి

మహిళా, శిశు-గిరిజన సంక్షేమంలో రెండేళ్లలో గణనీయ పురోగతి: మంత్రి సంధ్యారాణి

Gaddamidi Naveen
16 జూన్, 2026

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గత రెండు సంవత్సరాలలో రాష్ట్రంలో మహిళా, శిశు& గిరిజన సంక్షేమ రంగాలలో ఎన్నడూ లేని స్థాయిలో అపూర్వ ప్రగతి సాధ్యమైందని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె శాఖల వారీగా సాధించిన విజయాలను సుదీర్ఘంగా వివరించారు. సంక్షేమం అంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, భద్రత, పోషకాహారం, నాణ్యమైన విద్య, గౌరవప్రదమైన జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

మహిళా, శిశు సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 56,746 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి 5,389 మంది టీచర్లు, 5,287 మంది ఆయాల నియామకం ద్వారా మొత్తం 11 వేల మందికి పైగా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించారు. మినీ అంగన్‌వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేశారు. రూ.100 కోట్ల వ్యయంతో 10,000 కేంద్రాలలో తాగునీరు, ఆర్.ఓ. ప్లాంట్లు, పారిశుద్ధ్య వసతులు మెరుగుపరిచారు. ఇంధన పొదుపు కోసం ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేస్తున్నారు. అలాగే, పర్యవేక్షణను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసేందుకు రూ.72 కోట్ల వ్యయంతో అంగన్‌వాడీ టీచర్లకు ఆధునిక 5జీ స్మార్ట్‌ఫోన్లను అందజేశారు. మహిళల రక్షణ కోసం 26 జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లు ఒకే వేదికపై వైద్య, పోలీసు, న్యాయ సహాయాన్ని అందిస్తున్నాయి. గత రెండేళ్లలో 3,393 బాల్య వివాహాలను విజయవంతంగా అడ్డుకున్నారు. మాతా-శిశు సంరక్షణలో భాగంగా మొదటి ప్రసవానికి రూ.5,000, రెండో ప్రసవానికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు.

గిరిజన సంక్షేమంలో చారిత్రాత్మక పురోగతి

రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లతో కలిపి మొత్తం 2,715 గిరిజన విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, బెడ్‌షీట్లు, నోట్‌బుక్స్ వంటి వస్తువులను పంపిణీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో వేధించే సికిల్ సెల్ అనీమియా నియంత్రణకు లక్షలాది మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, విశాఖపట్నంలో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలకు ముగింపు పలకడమే లక్ష్యంగా అటవీ అనుమతులను అధిగమించి రహదారుల నిర్మాణం వేగవంతం చేశారు. రిజన రైతుల ఆదాయం పెంచేందుకు 2.26 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుతో పాటు మిరియాలు, పసుపు పంటలను ప్రోత్సహిస్తూ ట్రైకార్ రుణాలు అందిస్తున్నారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక "ఈగల్" బృందాలను రంగంలోకి దించారు.

ఇటీవల చేపట్టిన 16,500కు పైగా డీఎస్సీ నియామకాల ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాల విమర్శలను తప్పుబడుతూ.. గతంలో వారిని తొలగించినవారే ఇప్పుడు రాజకీయ ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని, కూటమి ప్రభుత్వం యువతకు స్థిరమైన ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. నల్లమల, శ్రీశైలం వంటి మారుమూల ప్రాంతాల్లోని 'చెంచు' తదితర గిరిజనులకు ఆధార్, రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తూ ప్రభుత్వ సేవలను వారందరికీ చేరుస్తున్నామని మంత్రి సంధ్యారాణి వివరించారు.