Let's talk: editor@tmv.in
నిధులు విడుదల చేయండి.. ప్రధానికి సిద్ధరామయ్య వినతి

నిధులు విడుదల చేయండి.. ప్రధానికి సిద్ధరామయ్య వినతి

Pinjari Chand
16 ఏప్రిల్, 2026

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధుల విడుదలలో పదేపదే జరుగుతున్న ఆలస్యం కారణంగా వ్యవస్థలో అసమానత భావన ఏర్పడుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోడీకి తెలిపారు. ఈ అంశాలపై జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలని కోరుతూ 18 ప్రధాన డిమాండ్లతో కూడిన మెమొరాండన్ని ఆయన బుధవారం ప్రధానికి సమర్పించారు. ప్రధాని మండ్య జిల్లాలోని అదిచుంచనగిరి పర్యటనకు వెళ్తూ బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా అందజేశారు. కర్ణాటకలో అమలులో ఉన్న 56 శాతం రిజర్వేషన్ విధానానికి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో స్థానం కల్పించాలని సిద్ధరామయ్య కోరారు. అలాగే కొన్ని ఓబీసీ వర్గాలను కేంద్ర జాబితాలో షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

నిధుల విడుదలలో ఆలస్యం

రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్లు, బెంగళూరుకు ప్రత్యేక గ్రాంట్లు, అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. దేశ ఆర్థికాభివృద్ధికి కర్ణాటక ముఖ్యంగా సహకరిస్తున్నప్పటికీ, కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కేంద్ర దృష్టికి తీసుకువస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

కోలార్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై డిమాండ్

రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన కోలార్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు ఇంకా అమలులోకి రాలేదని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,123 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ ప్రాజెక్టు ప్రారంభం కాలేదని, దీన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. బెంగళూరు–మైసూరు మార్గాన్ని ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్‌లో చేర్చాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే బెంగళూరు ఉపనగర రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర సహాయాన్ని త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా బెంగళూరు–ముంబై హైస్పీడ్ రైలు కారిడార్‌ను ప్రారంభించాలని సూచించారు.

జల్ జీవన్ మిషన్ నిధుల విడుదల

జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.17,554 కోట్ల కేంద్ర నిధులను విడుదల చేయాలని కోరారు. సురక్షిత తాగునీరు అందించేందుకు ఈ నిధులు కీలకమని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం గ్రామపంచాయతీలకు ఇవ్వాల్సిన రూ.2,860 కోట్ల గ్రాంట్లు ఇంకా విడుదల కాలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

జాతీయ రహదారుల ప్రాజెక్టులు

గత 12 సంవత్సరాల్లో కర్ణాటకలో పెద్దగా కొత్త జాతీయ రహదారి ప్రాజెక్టులు ఆమోదం పొందలేదని పేర్కొంటూ, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే మంజూరు చేయాలన్నారు. బెంగళూరుకు తాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల నీటి నిల్వ, 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు.

ఇతర ముఖ్య డిమాండ్లు

• అప్పర్‌‌ భద్రా ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా

• కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-II అవార్డును గెజిట్‌లో ప్రకటించడం

• మహదాయి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం కలసా నాలా డైవర్షన్ ప్రాజెక్టుకు వన్యప్రాణి అనుమతి

• కల్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధికి సంవత్సరానికి రూ.5,000 కోట్ల ప్రత్యేక సహాయం

• ఉత్తర కర్ణాటక జిల్లాల్లో కనీసం ఒక్కో పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏర్పాటు

• రాయచూరులో ఎయిమ్స్‌ స్థాపన

రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ అంశాలపై కేంద్రం త్వరగా చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య ప్రధానికి విజ్ఞప్తి చేశారు.