
సిద్దాపూర్ డంప్ యార్డ్ జీవోను వెంటనే ఉపసంహరించాలి: మాజీ మంత్రి హరీష్ రావు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో 86 ఎకరాల స్థలంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం. 641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. పచ్చని వ్యవసాయ భూముల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమన్నారు.
సిద్దాపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని దాదాపు 20 గ్రామాలు ఈ డంప్ యార్డు వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల జీవనాధారం పూర్తిగా వ్యవసాయమేనని, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అవసరమైన కూరగాయలను ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలానికి ఆనుకుని ఉన్న గుట్ట చెరువు నీటినే రైతులు సాగునీటిగా వినియోగిస్తున్నారని, అక్కడ డంప్ యార్డు ఏర్పాటైతే చెరువు నీరు కలుషితమై సాగునీటితో పాటు తాగునీటికీ తీవ్ర ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా, సమీపంలోనే ప్రసిద్ధ జహంగీర్ పీర్ దర్గా ఉండటంతో డంప్ యార్డు వల్ల ఏర్పడే కాలుష్యం స్థానిక ప్రజలతో పాటు దర్గాను సందర్శించే భక్తులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఐటీ పార్క్ రావాల్సిన చోట డంప్ యార్డా?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలోని సర్వే నంబర్లు 252, 278, 361లలో ఉన్న 334 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని హరీష్ రావు గుర్తుచేశారు. ఐటీ పార్క్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూముల్లో డంప్ యార్డు పెట్టి రోగాలను ఇవ్వడమేనా ‘ప్రజాపాలన’? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం డంప్ యార్డులను జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాలి తప్ప పచ్చని పల్లెలను, రైతులను ఆగమాగం చేయకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిద్దాపూర్ డంప్ యార్డు నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో 20 గ్రామాల ప్రజల తరఫున బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమించి, స్థానిక రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
