
మావోయిస్టు నిర్మూలనలో ఎస్‌ఐబీ కీలక పాత్ర: డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణలో నాలుగు దశాబ్దాలుగా ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరచడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) అసాధారణ పాత్ర పోషించిందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కొనియాడారు. సోమవారం ఆయన ఎస్‌ఐబీ కార్యాలయాన్ని సందర్శించి, రాష్ట్రంలో మావోయిస్టుల తాజా పరిస్థితి, కొనసాగుతున్న తీవ్రవాద నిరోధక ఆపరేషన్లు, నిఘా వ్యవస్థ పనితీరుపై ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థవంతంగా అడ్డుకోవడంలో, అండర్‌గ్రౌండ్ సీపీఐ (మావోయిస్టు) క్యాడర్ పెద్దఎత్తున లొంగిపోయేలా చేయడంలో ఎస్‌ఐబీ అధికారులు, సిబ్బంది నిరంతరం చేస్తున్న కృషిని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.
రెండేళ్లలో 820 మంది మావోయిస్టుల లొంగుబాటు
గత రెండేళ్లలో (2024 నుండి 2026 మధ్య కాలంలో) తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టులు రికార్డు స్థాయిలో లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. మొత్తం 820 మంది మావోయిస్టులు చట్టం ముందు లొంగిపోగా, వీరిలో నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 22 మంది స్టేట్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇది మావోయిస్టు సంస్థ నిర్మాణంపై గణనీయమైన ప్రభావం చూపిన పరిణామంగా పోలీసులు పేర్కొన్నారు. లొంగుబాటు ప్రక్రియలో భాగంగా మావోయిస్టులు తమ వద్ద ఉన్న 334 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో 58 ఏకే-47 రైఫిళ్లు, 48 ఇన్సాస్ రైఫిళ్లు, 50 ఎస్ఎల్ఆర్‌లు, 6 ఎల్‌ఎమ్‌జీలు, ఇతర ఆధునిక ఆయుధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
నిఘా ఆధారిత ఆపరేషన్లు చేపట్టడం, గిరిజన ప్రాంతాల్లో నమ్మకాన్ని పెంపొందించే చర్యలు చేపట్టడం ద్వారా సాయుధ మావోయిస్టు ఉద్యమం నడుం విరిచేలా ఎస్‌ఐబీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని డీజీపీ కొనియాడారు. అండర్‌గ్రౌండ్ క్యాడర్ హింసను వీడి, జనజీవన స్రవంతిలో కలిసేలా మోటివేట్ చేయడంలో ఎస్‌ఐబీ ప్రోయాక్టివ్ పాత్ర పోషించిందన్నారు.
పునరావాసంపై ప్రత్యేక దృష్టి
లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం సమాజంలో తిరిగి కలపడం కోసం చేపడుతున్న చర్యలను డీజీపీ సమీక్షించారు. లొంగిపోయిన వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ పోలీస్ శాఖ అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఎస్‌ఐబీ అధికారులు లొంగిపోయిన క్యాడర్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ.. వారికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ, ఉపాధి ఆధారిత కోర్సులు, ఉద్యోగ అవకాశాలు కల్పించి సమాజంలో గౌరవప్రదంగా బతికేలా చూడాలని సూచించారు.
నాలుగు దశాబ్దాల తర్వాత మావోయిజం క్షీణించిన నేపథ్యంలో, మారుతున్న భద్రతా వాతావరణానికి అనుగుణంగా ఎస్‌ఐబీ తన వ్యూహాలను మార్చుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. ఇకపై ఎస్‌ఐబీ కేవలం నక్సలిజంపైనే కాకుండా, విస్తృతమైన పోలీసింగ్ ఇంటెలిజెన్స్ పాత్రను చేపట్టాలి. సమాజంలో వస్తున్న మార్పులు, సోషల్ మీడియా ప్రభావం, యువతలో తలెత్తుతున్న శాంతిభద్రతల సమస్యలను నిశితంగా అధ్యయనం చేస్తూ.. భవిష్యత్తులో తెలంగాణ ఎదుర్కొనే సరికొత్త భద్రతా సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో రాష్ట్ర పోలీసులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ డీజీపీ (ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, ఐజీపీ (ఇంటెలిజెన్స్& ఎస్‌ఐబీ) కార్తికేయ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
