
రైతుల సమస్యలపై పోరాడితే గృహ నిర్బంధాలా? : కేటీఆర్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతుల తరఫున నిరసన తెలపడానికి బయలుదేరిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని వారు ఘాటుగా ఖండించారు.
యూరియా పంపిణీలో తీసుకొచ్చిన లోపభూయిష్టమైన యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడంపై కేటీఆర్ ఫోన్ ద్వారా మాట్లాడి మద్దతు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతుంటే, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుని ప్రతిపక్షాలపై పోలీసులను ఉసిగొల్పడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. యాప్‌ల పేరుతో రైతులను రోజుల తరబడి క్యూలలో నిలబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. గృహ నిర్బంధాలు, అక్రమ ఆంక్షలతో బీఆర్ఎస్ నాయకులను గానీ, అన్నదాతలను గానీ భయపెట్టలేరని కేటీఆర్ తెలిపారు.
అన్నదాతల ఆగ్రహం తప్పదు: హరీష్ రావు
రైతులకు యూరియా సరఫరా చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తన వైఫల్యాలను దాచడానికే ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడడం అవివేకమన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న 'యూరియా యాప్'ను తక్షణమే రద్దు చేయాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాత పద్ధతిలోనే రైతులకు అవసరమైనంత యూరియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను నిలువరించలేదని, రాబోయే రోజుల్లో అన్నదాతల ఆగ్రహం ఉప్పెనగా మారి ఈ నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని హరీష్ రావు హెచ్చరించారు. రైతుల రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు.
