Let's talk: editor@tmv.in
ఇటలీలో కాల్పులు.. గురుద్వారా వ‌ద్ద ఇద్దరు భారతీయుల మృతి

ఇటలీలో కాల్పులు.. గురుద్వారా వ‌ద్ద ఇద్దరు భారతీయుల మృతి

Shaik Mohammad Shaffee
20 ఏప్రిల్, 2026

ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన ఇద్దరు భారతీయులు ఇటలీలో దుండగుడి కాల్పులకు బలైపోయారు. బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వైశాఖి పండుగ వేడుకల కోసం గురుద్వారాకు వెళ్లి తిరిగి వస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

వేడుక ముగిసి వస్తుండగా ఘాతుకం

కోవో పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 'గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ' వద్ద ఈ ఘటన జరిగింది. వైశాఖి పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సిక్కు సమాజం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరై అర్ధరాత్రి 11:45 గంటల సమయంలో బయటకు వచ్చిన వారిపై దుండగుడు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించాడు. ఈ కాల్పుల్లో కోవో నివాసి రాగిందర్ సింగ్ (48), అగ్నాడెల్లో నివాసి గుర్మీత్ సింగ్ (48) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పథకం ప్రకారమే హత్య?

ఘటనా స్థలంలో పోలీసులు సుమారు 10 ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది క్షణికావేశంలో జరిగిన గొడవ కాదని, పక్కా పథకం ప్రకారం జరిపిన 'కోల్డ్ బ్లడెడ్ మర్డర్' అని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు కారులో వేగంగా పరారయ్యాడు. ఈ ఘటనలో మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని, బుల్లెట్లు అతడిని తాకుతూ వెళ్లాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

నిందితుడు తెలిసిన వాడేనా?

కాల్పులకు తెగబడిన వ్యక్తి కూడా భారత సంతతికి చెందినవాడేనని, అతను తరచుగా అదే గురుద్వారాకు వస్తుంటాడని ఒక సాక్షి తెలిపినట్లు 'లా సిసిలియా' పత్రిక పేర్కొంది. శనివారం నాడు స్థానిక ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో అధికారికంగా వైశాఖి వేడుకలు జరగాల్సి ఉండగా, అంతకు ముందే ఈ దారుణం జరగడం స్థానిక భారతీయ సమాజంలో కలకలం రేపింది.

దర్యాప్తు ముమ్మరం

కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పాత కక్షలేమైనా ఉన్నాయా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పండుగ పూట ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.