Let's talk: editor@tmv.in
వైట్‌హౌస్ విందులో కాల్పులు.. ట్రంప్ సురక్షితం
వైట్‌హౌస్ విందులో కాల్పులు.. ట్రంప్ సురక్షితం
వైట్‌హౌస్ విందులో కాల్పులు.. ట్రంప్ సురక్షితం
వైట్‌హౌస్ విందులో కాల్పులు.. ట్రంప్ సురక్షితం

వైట్‌హౌస్ విందులో కాల్పులు.. ట్రంప్ సురక్షితం

Shaik Mohammad Shaffee
27 ఏప్రిల్, 2026

అమెరికా రాజధాని వాషింగ్టన్ ఒక్కసారిగా తుపాకుల మోతతో దద్దరిల్లింది. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన వార్షిక విందు కార్యక్రమంలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో కార్యక్రమంలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు, వందలాది మంది జర్నలిస్టులు, ప్రముఖులు భయాందోళనలకు గురయ్యారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే స్పందించి ట్రంప్‌ను వేదికపై నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

అసలేం జరిగింది?

విందులో భాగంగా సుమారు 4,000 మంది అతిథులు భోజనం చేస్తున్న సమయంలో, ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినిపించాయి. తుపాకులు, కత్తులతో సాయుధుడైన ఒక వ్యక్తి హోటల్ లాబీ నుంచి బాల్‌రూమ్ వైపు దూసుకువచ్చాడు. భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కాల్పులు జరిగాయి. దీంతో అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. ఈ క్రమంలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు బుల్లెట్ తగిలినప్పటికీ, అతడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిందితుడిని బలగాలు నేలకేసి నొక్కిపట్టి అదుపులోకి తీసుకున్నాయి.

ఎవరీ నిందితుడు? లక్ష్యం ఎవరు?

పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన కోల్ టోమస్ అలెన్ (31) గా గుర్తించారు. అలెన్ ఉన్నత విద్యావంతుడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులే లక్ష్యంగా అతడు ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే వెల్లడించారు. నిందితుడు కాలిఫోర్నియా నుండి చికాగో మీదుగా రైలులో వాషింగ్టన్ చేరుకున్నాడు. ఘటన జరిగిన హోటల్‌లోనే అతిథిగా గదిని అద్దెకు తీసుకుని, పథకం ప్రకారం ఈ దాడికి ఒడిగట్టాడు.

ట్రంప్ ఏమన్నారంటే?

ఘటన జరిగిన రెండు గంటల తర్వాత ట్రంప్ శ్వేతసౌధం నుంచి విలేకరులతో మాట్లాడారు. "మనం ప్రభావవంతంగా పని చేస్తున్నప్పుడు మనపై దాడులు జరుగుతాయి. దీన్ని లోన్ ఉల్ఫ్ (ఒంటరి దుండగుడు) దాడిగా భావిస్తున్నాం. భద్రతా దళాలు అద్భుతంగా పనిచేశాయి. ఇలాంటి దాడులకు భయపడి మనం వెనక్కి తగ్గేది లేదు" అని ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని మరో 30 రోజుల్లో తిరిగి నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి

ట్రంప్‌పై జరిగిన ఈ దాడిని ప్రపంచ దేశాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. ట్రంప్ ఆయన కుటుంబం సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నానని, ప్రజాస్వామ్యంలో హింసకు అస్సలు చోటు లేదని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. మోడీతో పాటు కెనడా ప్రధాని మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వంటి అగ్రనేతలు ట్రంప్‌నకు తమ సంఘీభావాన్ని తెలిపారు. అటు అమెరికాలోని ప్రతిపక్ష నేతలు నాన్సీ పెలోసీ, చక్ షూమర్ కూడా రాజకీయాల్లో హింస ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ ఘోర ఉదంతాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం ఎఫ్‌బీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. నిందితుడు అలెన్‌ను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఘటనతో అమెరికాలో అధ్యక్ష స్థాయి భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.