Let's talk: editor@tmv.in
శివ నర్వాల్‌ స్వర్ణ గురి

శివ నర్వాల్‌ స్వర్ణ గురి

Shaik Mohammad Shaffee
22 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ షూటింగ్ క్రీడా వేదికపై భారత యువ షూటర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో మంగళవారం ప్రారంభమైన ‘ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ - 2026’ తొలిరోజే భారత్‌కు పతకాల పంట పండింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శివ నర్వాల్ బంగారు పతకంతో మెరవగా, మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో పనాహ్ భుగ్రా రజతాన్ని ముద్దాడింది. మరో షూటర్ చిరాగ్ శర్మ కాంస్య పతకాన్ని సాధించడంతో, భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

శివ ‘స్వర్ణ’ గురి.. చిరాగ్‌కు కాంస్యం

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో ఆసియా క్రీడల పతక విజేత శివ నర్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ పోరులో శివ 241.8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సోదిక్జోన్ అబ్దుల్లావ్ (240.0) రెండో స్థానంతో రజతం సాధించగా, భారత్‌కే చెందిన చిరాగ్ శర్మ 218.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అభినవ్ దేశ్వాల్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ భారత షూటర్లు 576 పాయింట్లతో టాప్-3లో నిలిచి తమ సత్తా చాటారు.

స్వల్ప తేడాతో చేజారిన స్వర్ణం

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పనాహ్ భుగ్రా భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. ఫైనల్‌లో అత్యంత నిలకడగా ఆడిన పనాహ్ 250.6 పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలుచుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన అన్సెలిన్ బ్రాక్‌మన్ (252.0) కేవలం స్వల్ప తేడాతో పనాహ్‌ను వెనక్కి నెట్టి స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ఈ విభాగంలో ముగ్గురు భారత షూటర్లు ఫైనల్‌కు చేరగా.. శాంభవి శ్రావణ్ నాలుగో స్థానంలో, అన్వీ రాథోడ్ ఆరో స్థానంలో నిలిచారు.

పతకాల పట్టికలో భారత్ టాప్

టోర్నమెంట్ తొలిరోజే ఒకేసారి మూడు పతకాలు (ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం) గెలుచుకోవడంతో భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 25 దేశాల నుంచి 284 మంది అథ్లెట్లు పాల్గొంటుండగా, భారత్ అత్యధికంగా 71 మంది షూటర్లతో కూడిన భారీ బృందాన్ని బరిలోకి దింపింది. గతేడాది జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో భారత్ ఏకంగా 17 స్వర్ణాలతో సహా మొత్తం 37 పతకాలు సాధించిన రికార్డు ఉంది. అదే జోరును ఈసారి కూడా కొనసాగించాలని భారత షూటర్లు పట్టుదలతో ఉన్నారు.