
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో శివసేన నిరసన
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో మహారాష్ట్రలో రాజకీయ వేడి రాజుకుంది. శనివారం ముంబైలో ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నాయకులు ప్రతిపక్ష ఇండియా కూటమికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివసేన నాయకురాలు, విధాన పరిషత్ డిప్యూటీ చైర్‌పర్సన్ నీలం గోర్హే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోస్టర్‌ను చింపివేయగా, ఇతర కార్యకర్తలు అఖిలేష్ యాదవ్ ఫోటోలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు.
మహిళా రిజర్వేషన్‌కు తాము మద్దతు ఇస్తున్నామని చెబుతూనే, ప్రతిపక్షాలు కావాలని బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాయని నీలం గోర్హే మండిపడ్డారు. ఈ బిల్లు వల్ల ఉత్తర, దక్షిణ భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. ప్రభుత్వం గనుక ఫ్లోర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను శ్రీకాంత్ షిండేకు అప్పగించి ఉంటే, బిల్లు ఖచ్చితంగా గెలిచేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్సీ సీటు కోసం దిగజారుడు రాజకీయాలు ..
మరోవైపు నీలం గోర్హే తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాహుల్ గాంధీ పోస్టర్‌ను చింపడం సిగ్గుచేటని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే విమర్శించారు. వచ్చే నెలలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు సంపాదించుకోవడానికే ఆమె ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని, అయితే బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని లోంధే స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజన వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఉత్తర-దక్షిణ విభజన వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం అధికారం కోసమే అధికార పార్టీ రాజ్యాంగ విలువలను బలి ఇస్తోందని దుయ్యబట్టారు.
లోక్‌సభలో శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయింది. బిల్లు ఆమోదం పొందడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ (352 ఓట్లు) అవసరం కాగా, కేవలం 298 ఓట్లు మాత్రమే అనుకూలంగా వచ్చాయి. 230 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో మహిళా రిజర్వేషన్ అమలుకు బ్రేక్ పడింది.
ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 850కి పెంచాలని ప్రభుత్వం భావించింది. 2011 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, ఆ తర్వాత మహిళా కోటాను అమలు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాల వ్యతిరేకతతో ఈ ప్రయత్నం ప్రస్తుతానికి నిలిచిపోయింది.
