Let's talk: editor@tmv.in
శాస్త్రిపురం ఆర్‌ఓబీ ప్రారంభం: మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమాకు ట్రాఫిక్ కష్టాలకు చెక్
శాస్త్రిపురం ఆర్‌ఓబీ ప్రారంభం: మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమాకు ట్రాఫిక్ కష్టాలకు చెక్

శాస్త్రిపురం ఆర్‌ఓబీ ప్రారంభం: మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమాకు ట్రాఫిక్ కష్టాలకు చెక్

Gaddamidi Naveen
18 ఏప్రిల్, 2026

హైదరాబాద్‌ పాతబస్తీ పరిసర ప్రాంతాల ప్ర‌జ‌ల‌ చిరకాల స్వప్నం నెరవేరింది. శాస్త్రిపురం మీదుగా మైలార్‌దేవ్‌పల్లి నుంచి వట్టేపల్లిని కలిపే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు.

సుమారు రూ.71 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 4-లేన్ల వంతెన స్థానిక రవాణా వ్యవస్థలో కీలక మార్పు తీసుకురానుంది. సికింద్రాబాద్–ఫలక్‌నుమా–శివరాంపల్లి రైల్వే లైన్‌పై ఎల్‌సీ నంబర్ 7 వద్ద ఈ వంతెనను నిర్మించారు. ఈ ఆర్‌ఓబీ మొత్తం పొడవు 490 మీటర్లు, వెడల్పు 16.6 మీటర్లు. రైల్వే ట్రాక్ పై ఉన్న భాగం 37.28 మీటర్ల పొడవు ఉంటుంది.

స్టీల్ గిర్డర్లు, ఆర్‌సీసీ ప్రీకాస్ట్ ఎలిమెంట్స్, మోడ్యులర్ ఎక్స్‌పాన్షన్ జాయింట్స్ వంటి అత్యాధునిక ఇంజనీరింగ్ ఫీచర్లతో దీనిని అత్యంత పటిష్టంగా నిర్మించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమా ఆర్టీసీ డిపోకు చేరుకునే సమయం సుమారు 30 నిమిషాల వరకు తగ్గనుంది.

ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడం వల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శాస్త్రిపురం ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తూ, పాతబస్తీ కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.