Let's talk: editor@tmv.in
దభోల్కర్ హత్య కేసులో శరద్ కలస్కర్‌కు బెయిల్ మంజూరు

దభోల్కర్ హత్య కేసులో శరద్ కలస్కర్‌కు బెయిల్ మంజూరు

Pinjari Chand
30 ఏప్రిల్, 2026

హేతువాద కార్యకర్త, మూఢనమ్మకాల వ్యతిరేక పోరాట యోధుడు నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన శరద్ కలాస్కర్‌కు బాంబే హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ, అతనిపై విధించిన జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. అతడే అసలు కాల్పులు జరిపిన వ్యక్తి అన్న అంశంపై సందేహం వ్యక్తం చేసిన కోర్టు, ఇద్దరు ‘ప్రత్యక్ష సాక్షుల’ విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. న్యాయవాదులు అజయ్ గడ్కరీ, రంజిత్‌సింగ్ భోంసాలేలతో కూడిన ధర్మాసనం, కలాస్కర్ రూ.50,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, అలాగే కేసు నమోదైన పుణేలోని డెక్కన్ పోలీస్ స్టేషన్‌కు ప్రతి నెల ఒకసారి హాజరుకావాలని ఆదేశించింది. 2018 సెప్టెంబర్‌లో అరెస్టయినప్పటి నుంచి కలాస్కర్ జైలులోనే ఉన్నాడని, అతని అప్పీల్ విచారణ సమీప కాలంలో జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంతవరకు శిక్షను నిలిపివేసి బెయిల్ ఇవ్వవచ్చని తీర్పులో తెలిపింది.

సాక్షుల ప్రవర్తనపై సందేహం

ప్రాసిక్యూషన్ బెయిల్ ఆర్డర్ అమలును నిలిపివేయాలని కోరినా కలాస్కర్‌ను దాడి చేసిన వ్యక్తిగా గుర్తించడంపై మాకు సందేహం ఉందంటూ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇద్దరు సాక్షుల ప్రవర్తనపై కూడా కోర్టు తీవ్ర సందేహం వ్యక్తం చేసింది. వారు సంఘటనను చూసినట్లు చెప్పినా, ముందుగా తమ పనులు పూర్తి చేసుకుని తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడం సాధారణ ప్రవర్తన కాదని వ్యాఖ్యానించింది. అంతేకాక, ఈ సాక్షుల ముందు కలాస్కర్‌ను గుర్తించే ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించకపోవడం, కేవలం ఫోటో చూపించడం కూడా విచారణలో లోపమని కోర్టు పేర్కొంది. 2013 ఆగస్టు 20న పుణేలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో, మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నరేంద్ర దభోలక్కర్‌‌ను కాల్చిచంపారు. ఆయన మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి స్థాపకుడు.

మరో కేసులోనూ బెయిల్

శరద్ కలస్కర్‌పై కమ్యూనిస్టు నేత, హేతువాది గోవింద్‌ పన్సారే హత్య కేసులో కూడా విచారణ కొనసాగుతోంది. ఆ కేసులో గత ఏడాది అక్టోబర్‌లోనే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ప్రస్తుత కేసులో కూడా బెయిల్ రావడంతో అవసరమైన ప్రక్రియలు పూర్తిచేసుకున్న తర్వాత అతను జైలు నుంచి విడుదల కానున్నాడు.

కేసు నేపథ్యం

మొదట ఈ కేసును స్థానిక పోలీసులు విచారించగా, తర్వాత ఆయన కుమార్తె ముక్తా దభోల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో 2014లో దర్యాప్తును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగించారు.

2024 తీర్పు

2024 మే 10న సెషన్స్ కోర్టు ఈ కేసులో సచిన్ అండూరే, శరద్ కలస్కర్‌లను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అయితే, యూఏపీఏ (ఉప), ఆర్మ్స్ యాక్ట్ కింద ఉన్న ఆరోపణల నుంచి వారిని విముక్తి కల్పించింది. అలాగే, సాక్ష్యాలు లేకపోవడంతో వీరేంద్ర సింగ్ తావ్డే, సంజీవ్ పునాలేకర్, విక్రమ్ భావేలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తన శిక్షను సవాలు చేస్తూ శరద్ కలస్కర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. ఈ అప్పీల్ విచారణ పెండింగ్‌లో ఉండగా, తన తరఫు న్యాయవాది శుభదా ఖోట్ ద్వారా బెయిల్ కోరాడు. ఇక ముక్తా దభోల్కర్ కూడా మరోవైపు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసి, నిందితులపై యూఏపీఏ ఆరోపణలు తొలగించడాన్ని, ఇతరులను విముక్తి చేయడాన్ని సవాలు చేశారు. ఈ హత్య వెనుక లెఫ్టిస్ట్‌ తీవ్రవాదుల పెద్ద కుట్ర ఉందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

వరుస హత్యలు

దభోల్కర్ హత్య తర్వాత దేశంలో హేతువాదులపై జరిగిన వరుస హత్యలకు ఇది ఆరంభమైంది.

2015 ఫిబ్రవరిలో కోల్హాపూర్‌లో గోవింద్‌ పన్సారే హత్య

2015 ఆగస్టులో ధారవాడలో ఎం.ఎం. కల్బుర్గి హత్య

2017 సెప్టెంబరులో బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య

ఈ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించాయి.