Let's talk: editor@tmv.in
శంకర్ గౌడ్‌‌ది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే: కేటీఆర్

శంకర్ గౌడ్‌‌ది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే: కేటీఆర్

Gaddamidi Naveen
25 ఏప్రిల్, 2026

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వం చేసిన 'హత్యే' అని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని భరించలేకే శంకర్ గౌడ్ ప్రాణత్యాగం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. బాధితులకు అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఒకేరోజు ముగ్గురు డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేయడం తెలంగాణ చరిత్రలో ఒక చీకటి రోజు అని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే కార్మికులు నిరాశలో ఉన్నారని, ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. ఆర్టీసీ సోదరులారా.. మనోధైర్యం కోల్పోకండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. నిరంకుశ పాలనపై సంఘటితంగా పోరాడి కార్మికుల హక్కులను సాధిస్తామని పేర్కొన్నారు.

శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత: మాజీ మంత్రి హరీష్ రావు

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం తన హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలసత్వం, నిర్లక్ష్యమే కారణమని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని హరీష్ రావు విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతారు? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారు? అంటూ ఆయన ముఖ్యమంత్రిని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణనలోకి తీసుకుని, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

శంకర్ గౌడ్ అమరుడైన రోజును "అప్పాయింటెడ్ డే"గా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలి. ప్రభుత్వం తక్షణమే కార్మికులతో చర్చలు జరిపి వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. ఆర్టీసీ కార్మిక సోదరులు ఎవరూ అధైర్యానికి లోనై తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఆత్మబలిదానాలు చేసుకోవద్దు. మీ పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం అని ఆయన భరోసా ఇచ్చారు. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి హక్కులను సాధించుకుందామని ఆయ‌న పిలుపునిచ్చారు.