Let's talk: editor@tmv.in
శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Gaddamidi Naveen
29 మే, 2026

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరును పెట్టాలని కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా గురువారం కేపీహెచ్‌బీ డివిజన్ వసంత్ నగర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో ఉన్న రాజకీయ, వ్యక్తిగత జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు.

మహోన్నత వ్యక్తి అయిన ఎన్టీఆర్ విగ్రహాలను కేవలం ఏర్పాటు చేయడమే కాకుండా, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేపీహెచ్‌బీ డివిజన్‌లోని మూడు ఎకరాల స్థలంలో ఎన్టీఆర్ పేరు మీద ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆ పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన పూర్తి బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని ఆయన గుర్తుచేశారు.

ఎన్టీఆర్ పాలనా సంస్కరణలను కొనియాడుతూ.. తెలంగాణలో శతాబ్దాలుగా ఉన్న పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి కులాల అభ్యున్నతికి, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడిన మ‌హనీయుడు ఎన్టీఆర్ అని కృష్ణారావు ప్రశంసించారు. నా రాజకీయ జీవితం ఎన్టీఆర్ తోనే ప్రారంభమైంది. పౌరుడిగా నా మొట్టమొదటి ఓటు హక్కును తెలుగుదేశం పార్టీకే వేశాను. దానికి కారణం ఎన్టీఆరే అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

గొప్ప నటుడిగా, అంతకుమించి ప్రజల హృదయాల్లో యుగపురుషుడిగా చరిత్రలో నిలిచిన ఎన్టీఆర్ ఎంతోమందికి ఆదర్శమన్నారు. ఎన్టీఆర్ జయంతి వేళ శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.