Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు.. కేసీఆర్ తిరిగి సీఎం కావడం ఖాయం: కేటీఆర్

కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు.. కేసీఆర్ తిరిగి సీఎం కావడం ఖాయం: కేటీఆర్

Gaddamidi Naveen
25 జూన్, 2026

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ది బూతులు, ఎగవేతలు, కూల్చివేతల పాలన అని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణ నలుమూలల ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఈ దుర్మార్గ పాలన పోవాలని, మళ్లీ మాజీ సీఎం కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మాయమాటలు విని మోసపోతే గోస తప్పదని ఆనాడే కేసీఆర్ చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఈ రెండున్నరేళ్ల అసమర్థ పాలనలో మోసపోని వర్గం, కుప్పకూలని రంగం లేదని మండిపడ్డారు.

ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ 11 సార్లు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేసి రూ. 73 వేల కోట్లు అందించారు. కానీ, ఈ రెండున్నరేళ్లలో మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన వారు ప్ర‌జ‌ల‌కు తెలుసన్నారు. రాష్ట్రంలో రైతుబంధు పడటం లేదు కానీ, ఢిల్లీకి సంచులు పోతుండటంతో అక్కడ ‘రాహుల్ బంధు’ మాత్రం ఠంచన్‌గా పడుతోందని ఎద్దేవా చేశారు. రూ. 50 వేల కోట్ల రుణమాఫీని చివరకు రూ. 20 వేల కోట్లకు కుదించారని ఆరోపించారు. అన్ని రకాల వడ్లకు బోనస్ అని చెప్పి, చివరకు ఏడు రకాలకే పరిమితం చేశారన్నారు. షాపుల్లో లేని యూరియాను యాప్‌లలో పెడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ రాగానే ఈ 'యూరియా యాప్'ను బంగాళాఖాతంలో పడేసి, పూర్వపు రోజుల్లా పొలం కాడికే యూరియా వచ్చేలా చేస్తామన్నారు.

ఖమ్మం మంత్రులపై తీవ్ర ఆరోపణలు

ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల వద్ద పవర్‌ఫుల్ శాఖలు ఉన్నా జిల్లాకు ఒరిగింది శూన్యమని కేటీఆర్ విమర్శించారు. వ్యవసాయ మంత్రే సీతారామ ప్రాజెక్టు నుంచి రూ. 100 కోట్ల మట్టి దోపిడీ చేస్తున్నారని, మరో మంత్రి పొంగులేటి కాంట్రాక్టుల రూపంలో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి సంపద పెరుగుతోందని, బుగ్గపాడు ఫుడ్ పార్కులో ఎకరానికి రూ. 60 లక్షల విలువైన భూములను రూ. 21 లక్షలకే ఎందుకు రాసిచ్చారో ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే రూ. 8 వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సీతారామ ప్రాజెక్టును మళ్లీ తాము అధికారంలోకి రాగానే పూర్తి చేసి సత్తుపల్లి రైతులకు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు.

విద్యార్థులు, విలేకరులకు అన్యాయం

రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. అలాగే విలేకరుల అక్రిడేషన్ కార్డుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ, ఐఅండ్‌పీఆర్‌ మంత్రి దీనిపై స్పందించకపోతే హైదరాబాద్ వేదికగా ఒత్తిడి తెస్తామన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తామన్న హామీపై సవాల్ విసురుతూ.. కోటి 67 లక్ష‌ల‌ మంది ఆడబిడ్డల ఖాతాల్లో రూ. 1.50 లక్షల చొప్పున వేస్తే తాను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానన్నారు.

ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని ఒక్క అర్హులైన ఓటరు పేరు కూడా పోకుండా చూడాలని కేటీఆర్ కోరారు. అలాగే ఇంటింటికీ వెళ్లి కొత్త డిజిటల్ యాప్ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
KTRBRSBRSBharatRashtraSamithiKCRTelanganaTelanganaPoliticsKhammamSathupalliCongressGovernmentRevanthReddyFarmersRythuBandhu
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు.. కేసీఆర్ తిరిగి సీఎం కావడం ఖాయం: కేటీఆర్ - Tholi Paluku