
విశాఖ ‘జూ’లో ఏడేళ్ల ఆసియా సింహం మృతి
విశాఖ నగరంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో విషాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్న ఏడేళ్ల వయసున్న ‘లియో’ అనే మగ ఆసియా సింహం మృతి చెందింది. ఈ విషయాన్ని జూ క్యూరేటర్ జి. మంగమ్మ మంగళవారం అధికారికంగా వెల్లడించారు. జంతు ప్రదర్శనశాలలోని వెటర్నరీ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించినప్పటికీ సింహం ప్రాణాలను కాపాడలేకపోయారు.
జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా అస్సాం స్టేట్ జూ నుంచి ఈ మగ ఆసియా సింహాన్ని ఇటీవల విశాఖకు తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం సాధారణ ప్రజల సందర్శనకు అనుమతించకుండా తొలుత దీన్ని క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షించారు. అయితే విశాఖకు వచ్చినప్పటి నుంచే ఈ సింహం అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
మార్చి 19న లియోకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అది తీవ్రమైన వ్యాధుల బారిన పడినట్లు నిర్ధారణ అయింది. పరాన్నజీవుల ద్వారా వ్యాపించే ‘ట్రైపానోసోమియాసిస్’ టిక్స్ ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ‘ఎర్లికియోసిస్’ రెండూ ఒకేసారి సోకడంతో సింహం ఆరోగ్యం క్షీణించింది. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో సోమవారం ఉదయం బహుళ అవయవ వైఫల్యం వల్ల లియో తుదిశ్వాస విడిచింది. అత్యంత అరుదైన ఆసియా సింహం జాతికి చెందిన లియో మృతి పట్ల జూ సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
