Let's talk: editor@tmv.in
బయ్యారంలో ‘గ్రీన్ స్టీల్ ప్లాంట్’ను ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

బయ్యారంలో ‘గ్రీన్ స్టీల్ ప్లాంట్’ను ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
19 ఏప్రిల్, 2026

తెలంగాణను పారిశ్రామికంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో సమావేశమై రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సంబంధించి పలు ప్రతిపాదనలు సమర్పించారు.

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అత్యాధునిక 'గ్రీన్ స్టీల్ ప్లాంట్' ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దేశంలో ఉక్కు కొరత తగ్గడమే కాకుండా, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన వివరించారు. ఈ ప్లాంట్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా ప్రతిపాదించబడింది. పాత వాహనాల స్క్రాప్‌ను ఉపయోగించి ఉక్కును రీసైక్లింగ్ చేయడం ద్వారా ఉత్పత్తి పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇది తోడ్పడుతుందని వివరించారు. పరిశ్రమల విస్తరణకు తెలంగాణలో ఉన్న సౌకర్యాలు, సాంకేతిక సామర్థ్యాలు దేశ పారిశ్రామిక లక్ష్యాలకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని గ్రీన్ స్టీల్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని కూడా సీఎం సూచించారు. ముఖ్యంగా హైడ్రోజన్ టెక్నాలజీ ఆధారంగా ఉక్కు తయారీని ప్రోత్సహించాలని, ఆటోమొబైల్, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీ తయారీ కేంద్రం కూడా అవసరమని చెప్పారు.

ఇంకా మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి భవిష్యత్ సాంకేతికతలకు ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కేంద్ర సహకారం కోరారు. అదనంగా, ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించే జాతీయ స్థాయి శిక్షణ సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు.

ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా హాజరయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.