
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నం నగరంలోని గాజువాక శ్రీనగర్ జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సు శ్రీనగర్ జంక్షన్ దాటిన తర్వాత ఈ ప్రమాదానికి గురైంది. రహదారిపై నిలిపి ఉంచిన లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బస్సు సహాయ డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు విశాఖపట్నం డీసీపీ-2 మేరీ ప్రశాంతి వెల్లడించారు.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)కి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ మిగతా క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు ధృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి:మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రమాద ఘటనపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేజీహెచ్ అధికారులు, జిల్లా యంత్రాంగంతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో ఒకరు లేదా ఇద్దరికి అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఈ ఘోర రహదారి ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
పోలీసుల దర్యాప్తు.. లారీ డ్రైవర్ కోసం గాలింపు
ఈ ప్రమాదంపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన బస్సు, లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధ్యుడైన లారీ డ్రైవర్ ప్రమాదం అనంతరం ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అతనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
