Let's talk: editor@tmv.in
ముడి చమురు ధరలసెగతో .. 416 పాయింట్లు సెన్సెక్స్ పతనం

ముడి చమురు ధరలసెగతో .. 416 పాయింట్లు సెన్సెక్స్ పతనం

Dantu Vijaya Lakshmi Prasanna
29 ఏప్రిల్, 2026

భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం లాంటి చర్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి. దీనివల్ల కీలక సూచీలు రెండూ నష్టాల్లో ముగిశాయి. గత సెషన్‌లో లాభాల్లో ఉన్న మార్కెట్, ఈరోజు అమ్మకాల ఒత్తిడికి లోనై ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.

బిఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 416.72 పాయింట్లు (0.54 శాతం) పతనం చెంది 76,886.91 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో ఇది 562.57 పాయింట్ల వరకు పడిపోయి 76,741.06 కనిష్ట స్థాయిని తాకింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 97 పాయింట్లు (0.40 శాతం) తగ్గి 23,995.70 వద్ద ముగిసింది. కీలకమైన 24,000 మార్కు కంటే దిగువన నిఫ్టీ ముగియడం గమనార్హం.

ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి. సెన్సెక్స్-30 కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మారుతీ సుజుకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ అత్యధికంగా నష్టపోయాయి. అయితే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా వంటి షేర్లు లాభాలను గడించి మార్కెట్‌కు కొంత అండగా నిలిచాయి.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయంతో అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 2.97 శాతం పెరిగి బ్యారెల్‌కు 111.4 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు 110 డాలర్లు దాటడం భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనికి తోడు భారత రూపాయి విలువ 94.5 కంటే దిగువకు పడిపోవడం ఆర్థిక ఒత్తిడిని పెంచింది.

విదేశీ పెట్టుబడిదారుల వైఖరి కూడా మార్కెట్‌ను కలవరపెడుతోంది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం ఒక్కరోజే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 1,151.48 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ వరుస అమ్మకాలు దేశీయ మార్కెట్లలో లిక్విడిటీని తగ్గిస్తున్నాయి. ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే జపాన్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మాత్రం కొంత సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ అభిప్రాయం ప్రకారం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న అంతరాయాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి క్షీణత, ఎఫ్ఐఐల నిరంతర విక్రయాలు భారత మార్కెట్లపై స్థూల ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. సోమవారం సెన్సెక్స్ 639 పాయింట్లు పెరిగినప్పటికీ, మంగళవారం నాటి పతనం ఆ లాభాలను హరించింది. పర్యవసానంగా మార్కెట్ తీవ్ర అనిశ్చితిలో కొనసాగుతోంది.

అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,420 తగ్గి రూ.1,53,000 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,300 తగ్గి రూ.1,40,250 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా వెండి ధర కూడా కిలోకు రూ.5,000 వరకు క్షీణించి రూ.2,65,000 వద్ద స్థిరపడింది. ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, మార్కెట్ ఒత్తిడి కారణంగా పసిడి ధరలు కొద్దిగా దిగిరావడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే అంశం.

ముడి చమురు ధరలసెగతో .. 416 పాయింట్లు సెన్సెక్స్ పతనం - Tholi Paluku