Let's talk: editor@tmv.in
సాయికృష్ణ కేసులో సంచలనం.. సీఐ నాగరాజుపై ‘హత్య’ కేసు నమోదు

సాయికృష్ణ కేసులో సంచలనం.. సీఐ నాగరాజుపై ‘హత్య’ కేసు నమోదు

Gaddamidi Naveen
20 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్న యువకుడి 'మిస్సింగ్' ఉదంతం చివరకు హత్య కేసుగా మారింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సస్పెండ్ అయిన ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజుపై పోలీసులు శుక్రవారం హత్య కేసుతో పాటు పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన కుమారుడిని పోలీస్ కస్టడీలోనే ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా హింసించి, చంపేశాడని బాధితుడి తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

గాదె సాయికృష్ణ (23) అనే యువకుడి అదృశ్యం కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్ నాగరాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి (53) గురువారం సాయంత్రం ఇన్‌స్పెక్టర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, శుక్రవారం పోలీసులు అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 103(1) కింద హత్య, సెక్షన్ 127(4), 127(6) కింద అక్రమ నిర్బంధం కేసులు నమోదు చేశారు. అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 238ను కూడా చేర్చారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన ఫిర్యాదులో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేశారు. ఇన్‌స్పెక్టర్ నాగరాజు తన కుమారుడిని పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశాడని ఆరోపించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా సాయికృష్ణ మృతదేహాన్ని రహస్యంగా కాల్చి బూడిద చేశాడని ఆమె వాపోయారు. "నా కొడుకు బతికుంటే నా ముందు ప్రవేశపెట్టండి, లేదంటే కనీసం అతని భౌతిక కాయాన్నైనా నాకు అప్పగించండి" అంటూ ఆమె గతంలో చేసిన డిమాండ్ అందరినీ కదిలించింది.

ముఖ్యమంత్రి ఆదేశం – విపక్షాల డిమాండ్

ఈ అదృశ్యం ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించారు.

మరోవైపు గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ అనుమానాస్పద కస్టడీ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కస్టడీలో సాయికృష్ణను ఘోరంగా హింసించారని, అతని గోళ్లు కూడా పీకేశారని జగన్ ఆరోపించారు. మే 9 నుంచి జూన్ 2 వరకు బాధితుడి తల్లి ప్రతిరోజూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కొడుకును చూపించమని వేడుకుందని, లోపల తన కొడుకు పెడుతున్న కేకలు వినబడుతున్నా పోలీసులు ఆమెను లోపలికి రానివ్వలేదని జగన్ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వంటి ఉన్నతాధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆయన విమర్శించారు.

ఇదిలా ఉండగా, ఇన్‌స్పెక్టర్ నాగరాజు వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పెరుపోగు క్రాంతి కుమార్ అనే దళిత యువకుడు చెబుతున్న సెల్ఫీ వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చి సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. మే 21న క్రాంతి కుమార్ నాగరాజు వేధింపులు తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ కేసుతో పాటు ఈ పాత వీడియో కూడా బయటకు రావడంతో ఇన్‌స్పెక్టర్ నాగరాజు ఘటనకు కూడా సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.