Let's talk: editor@tmv.in
తెలంగాణలో నేటి నుంచి 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' ప్రారంభం

తెలంగాణలో నేటి నుంచి 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' ప్రారంభం

Gaddamidi Naveen
26 ఏప్రిల్, 2026

తెలంగాణలో జనగణన–2027 ప్రక్రియలో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానం (నేడు) ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని జనగణన డైరెక్టర్ భారతి హోళికెరి తెలిపారు. హైద‌రాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఇందుకోసం https://se.census.gov.in వెబ్ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చని సూచించారు.

సెల్ఫ్ ఎన్యుమరేషన్ తప్పనిసరి కాదని, ఇది కేవలం ప్రజల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన విధానమని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత నిర్వహిస్తున్న తొలి జనగణన ఇదేనని, అదే సమయంలో పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతున్న మొదటి జనగణన కూడా ఇదేనని పేర్కొన్నారు.

రాష్ట్ర భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి నిర్మాణాన్ని, ప్రతి కుటుంబాన్ని లెక్కలోకి తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రులు, పాఠశాలలు, దేవాలయాలు, గుడిసెలు, అద్దె ఇళ్లు ఏవైనా జనగణనలో భాగమవుతాయని వివరించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి భవనాన్ని గుర్తించి, అందులో ఉన్న ఇళ్ల సంఖ్యను నమోదు చేస్తారని చెప్పారు. ఈ ప్రక్రియను బ్లాకులుగా విభజించి నిర్వహిస్తామని తెలిపారు.

జనగణన రెండో దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభమై, వ్యక్తిగత వివరాల సేకరణ చేపడతారని భారతి హోళికెరి వెల్లడించారు. ఈ విధానం ద్వారా ప్రజలు నేరుగా జనగణనలో భాగస్వామ్యం కావడానికి మంచి అవకాశం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.