Let's talk: editor@tmv.in
బెంగాల్ రెండో దశ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం: ఈసీఐ

బెంగాల్ రెండో దశ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం: ఈసీఐ

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ముందు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఓటింగ్‌ను అడ్డుకుంటే, ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 29న పోలింగ్ జరగనున్న 142 నియోజకవర్గాల్లో ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ, ప్రతి ప్రాంతంలో భద్రతా సిబ్బందిని విభాగాల వారీగా మోహరించాలని ఆదేశించింది. ముఖ్యంగా సున్నిత ప్రాంతాలు, అంతర్గత వీధుల్లో ‘ఏరియా డామినేషన్’ చర్యలు చేపట్టి, ఓటర్లు భయమేమీ లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించింది. భద్రతా ప్రణాళికలో భాగంగా, ప్రతి నియోజకవర్గంలో వేగవంతమైన చర్యల కోసం ఇద్దరు సిబ్బందితో 160 మోటార్‌సైకిళ్లను వినియోగించనున్నారు. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌) విస్తృతంగా మోహరించాలని సూచించింది.

కొల్‌కత్తాలో జరిగిన ఉన్నతస్థాయి సమన్వయ సమావేశంలో పోలింగ్ అధికారులు, సీనియర్ పోలీస్ అధికారులు, కేంద్ర బలగాల కమాండర్లు పాల్గొన్నారు. కొల్‌కత్తా ఉత్తర, దక్షిణ, సౌత్ 24 పరగణాస్ జిల్లాల ఎన్నికల అధికారులు, పరిశీలకులు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని కాక్ద్వీప్‌ను సందర్శించి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. శాంతియుతంగా పోలింగ్ నిర్వహించేందుకు సహకరించాలని ఆయన కోరారు. బోగస్ ఓటింగ్, బూత్ క్యాప్చరింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలి. దానికి అడ్డంకులు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని అగర్వాల్ హెచ్చరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, కేంద్ర బలగాలను మోహరించనున్నారు. పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో అనధికారిక వ్యక్తులకు ప్రవేశం ఉండదని అధికారులు తెలిపారు. రెండో దశ పోలింగ్‌కు ముందు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తరహా సమీక్షలు కొనసాగుతున్నాయని, భయంలేని, నిష్పక్షపాత, శాంతియుత ఎన్నికల నిర్వహణే లక్ష్యమని ఈసీ పేర్కొంది.