
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు 64 శాతం పూర్తి
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారిపోనున్నాయి. ఇక్కడ ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. రూ. 714.73 కోట్ల భారీ బడ్జెట్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 64 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే ఈ ఆధునిక స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.
స్టేషన్‌లో అందుబాటులోకి రానున్న అత్యాధునిక వసతులు
స్టేషన్‌లో అత్యాధునిక డిజైన్‌తో కొత్త భవనాలు, రెండు అంతస్తుల ఎయిర్ కాంకోర్స్, అన్ని ప్లాట్‌ఫారమ్‌లను కవర్ చేసే భారీ రూఫ్‌టాప్, మల్టీ-లెవెల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సులభతర ప్రయాణానికి 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, మెట్రో స్టేషన్లకు అనుసంధానించే స్కైవాక్‌లు, సోలార్ పవర్ ప్లాంట్, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, సీసీటీవీ ఆధారిత ఆధునిక భద్రతా వ్యవస్థలను కల్పిస్తున్నారు.
ఇప్పటికే తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భవనం, కాజీపేట వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దక్షిణ భాగంలోని అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యాయి. ప్రస్తుతం దక్షిణ, ఉత్తర భాగాల్లో స్టేషన్ భవనాలు, మల్టీ-లెవెల్ పార్కింగ్, ఎయిర్ కాంకోర్స్, ప్లాట్‌ఫారమ్‌ల పైకప్పులు, ట్రావలేటర్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ), అలాగే సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లను అనుసంధానించే స్కైవాక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ప్రాజెక్టు అందుకు నిదర్శనమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
