Let's talk: editor@tmv.in
ఈ నెలాఖరున రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఈ నెలాఖరున రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఈ నెలాఖరున రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Gaddamidi Naveen
4 మే, 2026

కూసుమంచిలో ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., అదనపు కలెక్టర్ డా. పీ. శ్రీజ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అధికారులు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి, సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాలేరు నియోజకవర్గం పరిధిలో మండలాలను క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తున్నామని, అర్హతే ఏకైక ప్రమాణమని, రాజకీయాలకు ఎలాంటి చోటు ఉండదని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజాదర్బార్‌లలో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లుకు సంబంధించిన దరఖాస్తులే వస్తున్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. గృహనిర్మాణానికి సంబంధించిన నిధులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ మంజూరును మే నెలాఖరులోపు పూర్తి చేస్తామని వెల్లడించారు.

రైతు సంక్షేమం, భూ సమస్యలు

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా, నిషేధిత భూముల జాబితాలు, భూ రికార్డులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు. ఈ అంశాల్లో శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణ ద్వారా సంక్షేమ పథకాల అమలు మరింత వేగవంతమైందని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఆలస్యం లేకుండా న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి వరి, మొక్కజొన్న పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని, రైతుల ఖాతాల్లో వారంలోపే చెల్లింపులు జమ అవుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు చేశామని, రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకి పెంచామని తెలిపారు. సన్న వరిధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీ పంపిణీ కార్యక్రమాన్ని మే 5 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.