Let's talk: editor@tmv.in
జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత ‘ఇందిరమ్మ ఇళ్లు’ పంపిణీ

జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత ‘ఇందిరమ్మ ఇళ్లు’ పంపిణీ

Gaddamidi Naveen
13 మే, 2026

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న‌ ఆదిలాబాద్ వేదికగా రెండో విడత 'ఇందిరమ్మ ఇళ్ల' నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. మంగళవారం గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.

నియోజకవర్గమే యూనిట్‌గా భూ సేకరణ

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నగరం నుంచి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల పేదల జీవనోపాధి దెబ్బతింటోందని మంత్రి విమర్శించారు. ఈ తప్పులు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల లోపే ఇళ్లు నిర్మించాలని ఆదేశించారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు, శిథిలావస్థలో ఉన్న పాత కాలనీలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో సొంత స్థలం కలిగిన అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని మంత్రి ఆదేశించారు.

పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, కాలనీకి సమీపంలో ఉండేవారికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లలో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస వసతులు కల్పించి పేదలు వెంటనే గృహ ప్రవేశం చేసేలా చూడాలన్నారు. ప్రభుత్వ భూమి ఒక్క ఇంచు కూడా ఆక్రమణకు గురైతే సహించం అని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. మల్కాజిగిరిలో కోర్టు పరిధిలో ఉన్న యూఎల్సీ భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేసిన సబ్-రిజిస్ట్రార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వంత భవనాలు లేని ఆర్‌డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు కోరారు.

రాజకీయాలకు తావులేదు: మంత్రుల స్పందన

ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ పథకంలో పేదరికమే ఏకైక ప్రాతిపదిక అని, రాజకీయాలకు తావులేదని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పథకం అమలుపై పలు సూచనలు చేశారు. కలెక్టర్లు ప్రతి వారం ఈ పథకంపై సమీక్ష నిర్వహించాలని స్పీకర్ సూచించారు.