
ఏపీలో ఎన్నికల జాబితాల సమగ్ర సర్వేకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా లోపరహితంగా మార్చేందుకు భారత ఎన్నికల సంఘం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్ 2026) కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ ప్రకటించారు. ఈ సవరణ ప్రక్రియకు 2026 జూలై 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
క్షేత్రస్థాయి పరిశీలనకు భారీ యంత్రాంగం
రాష్ట్రంలో ప్రస్తుతం నమోదై ఉన్న 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను వంద శాతం ఖచ్చితత్వంతో ధృవీకరించేందుకు ఎన్నికల శాఖ విస్తృత ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లనున్నారు. ప్రతి ఇంటినీ సందర్శించి ఓటరు పేరు, చిరునామా, వయస్సు, నివాస స్థితిని వారు నిశితంగా పరిశీలిస్తారు. అదేవిధంగా అర్హులైన కొత్త ఓటర్ల నమోదుతో పాటు మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను కూడా క్షేత్రస్థాయిలోనే పూర్తి చేస్తారు.
రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో పారదర్శకత
ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఎటువంటి అపోహలకు తావులేకుండా పూర్తి పారదర్శకతను పెంపొందించేందుకు రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. ఇందుకోసం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుగ్గా పాల్గొనడం ద్వారా ప్రక్రియ మరింత పక్కాగా సాగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య క్రతువులో అన్ని రాజకీయ పార్టీలు తమకు పూర్తి స్థాయిలో సహకరించాలని సీఈఓ వివేక్ యాదవ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఇంటింటి సర్వే షెడ్యూల్
ఎన్నికల సంఘం ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం జూన్ 6 నుంచి జూన్ 14 వరకు తొలి దశ సన్నాహక చర్యలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు సవరణకు అవసరమైన వివిధ రకాల ఫారాలు, అధికారిక పత్రాల ముద్రణ పనులను పూర్తి చేస్తారు. ఆ వెంటనే జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఇదే సమయంలో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, బూత్‌ల సర్దుబాటు పనులను కూడా సమాంతరంగా చేపడతారు.
అభ్యంతరాల స్వీకరణ.. సెప్టెంబర్‌లో తుది జాబితా
ఇంటింటి సర్వే అనంతరం జూలై 21న ‘ప్రాథమిక ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఆ తర్వాత జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ప్రజలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు తప్పుల సవరణలు లేదా అభ్యంతరాలు ఉన్నవారు ఈ కాలంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రజల నుంచి వచ్చిన ఈ దరఖాస్తులు, క్లెయిములపై జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాటిని పరిష్కరిస్తారు. అన్ని లోపాలను సరిదిద్దిన తర్వా త సెప్టెంబర్ 22న ‘తుది ఓటరు జాబితా ను అధికారికంగా ప్రకటిస్తారు.
నకిలీ ఓట్లకు చెక్.. యువతకు పెద్దపీట
గతంలో తలెత్తిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని నకిలీ ఓట్లు, ఒకే వ్యక్తి పేరు వేర్వేరు ప్రాంతాల్లో నమోదు కావడం వంటి సమస్యలను పూర్తిగా నివారించడమే ఈ ప్రత్యేక సవరణ ముఖ్య లక్ష్యం. అలాగే, మరణించిన వారి పేర్లు జాబితాలో కొనసాగకుండా శాశ్వతంగా తొలగిస్తారు. దీనితో పాటు, 18 ఏళ్లు పూర్తిచేసుకున్న నూతన యువ ఓటర్లను పెద్ద ఎత్తున నమోదు చేయడంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రజాస్వామ్యానికి ఓటరు జాబితాయే పునాది అని అందువల్ల ప్రజలందరూ బాధ్యతగా ఈ సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.
