
ఖరీఫ్ సాగునీటి విడుదలకు షెడ్యూల్ ఖరారు
ఖరీఫ్-2026 సాగు సీజన్‌ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వలను ప్రాతిపదికగా తీసుకుని రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాగునీటి విడుదల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు అమరావతి సచివాలయంలో సోమవారం వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సంయుక్తంగా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సుదీర్ఘ సమావేశంలో ఖరీఫ్ సాగు ప్రణాళికలతో పాటు విత్తనాలు, ఎరువుల లభ్యతపై సమగ్రంగా చర్చించి అనంతరం ఉమ్మడిగా సాగునీటి విడుదల క్యాలెండర్‌ను ప్రకటించారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడిక వంటి అత్యవసర పనులను చేపట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. 397 కోట్లను కేటాయించిందని ప్రస్తుతం ఈ మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రులు వెల్లడించారు. ఈ పనులన్నింటినీ మే చివరి నాటికే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జూన్ 1వ తేదీ నుంచి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని స్పష్టం చేస్తూ రైతులు తమ సాగు పనులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రైతాంగం కూడా ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఇక గడచిన 2025-26 సీజన్లలో సాధించిన ఫలితాలను ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. గత ఖరీఫ్ సీజన్లో 99.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి గానూ 888 టీఎంసీల నీటిని అదేవిదంగా రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాల ఆయకట్టుకు 153 టీఎంసీల నీటిని విజయవంతంగా సరఫరా చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మేజర్, మీడియం రిజర్వాయర్లలో 461 టిఎంసిల నీరు సాగునీటి వినియోగానికి సిద్ధంగా ఉందన్నారు.
ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల ఆయకట్టు అవసరాలను బట్టి ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేశారు. అందులో భాగంగా పెన్నా డెల్టాకు ఇప్పటికే మే 4వ తేదీ నుంచి సాగునీటిని విడుదల చేయగా గోదావరి డెల్టాకు జూన్ 1 నుండి నీటిని వదలనున్నారు. అదేవిదంగా గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్‌ఎస్‌ఎస్) కింద ఉన్న ఆయకట్టుకు జూన్ 10 నుంచి, టిజిపి కడప (ఎస్పీవీబీఆర్ కడప) కు జూన్ 15 నుండి, ఉత్తరాంధ్రలోని వంశధార ఆయకట్టుకు జూన్ 15 నుండి, తోటపల్లి ఆయకట్టుకు జూలై 1 నుంచి, కృష్ణా డెల్టా ఆయకట్టుకు జూలై 1వ తేదీ నుంచి సాగునీటిని విడుదల చేయనున్నారు.
మిగిలిన ప్రాజెక్టుల పరిధిలో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు జూలై 10 నుండి, కేసి కెనాల్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, టిబిపిఎల్‌ఎల్‌సి, తాడిపూడి, పుష్కర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు జూలై 15 నుండి నీటి సరఫరా ప్రారంభమవుతుంది. ఇక టిబిపిహెచ్‌ఎల్‌సి కింద ఉన్న ప్రాంతాలకు జూలై 20 నుంచి హంద్రీనీవా సుజలస్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ఆయకట్టుకు జూలై 31 నుంచి నీరు విడుదల చేస్తారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్న జోన్-1 (పల్నాడు, గుంటూరు, బాపట్ల) ప్రాంతాలకు జూలై 31న, జోన్-2 (ప్రకాశం, మార్కాపురం) ఆయకట్టుకు ఆగస్టు చివరి వారంలో సాగునీటిని విడుదల చేసేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఎన్సీ నరసింహమూర్తి సహా ఇరు శాఖల కీలక అధికారులు పాల్గొని ఖరీఫ్ ప్రణాళికల అమలుపై మంత్రులకు నివేదికలు సమర్పించారు.
