
సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడను కాపాడండి:స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్
రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
దశాబ్దాలుగా సామాన్య ప్రజలకు అందుబాటులో వినోదాన్ని అందిస్తున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం మల్టీప్లెక్స్‌ల పోటీతో పాటు ఓటీటీ వేదికల ప్రభావంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, మున్సిపల్ పన్నులు, నిర్వహణ వ్యయాలు భరించలేక అనేక థియేటర్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
ఈ నేపథ్యంలో థియేటర్ల నిర్వహణకు ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు ప్రతిపాదనలు చేశారు. నాన్-ఏసీ థియేటర్లకు ప్రస్తుతం ఉన్న రూ.3 మెయింటెనెన్స్ ఛార్జీని రూ.7కు, ఏసీ థియేటర్లకు రూ.5ను రూ.15కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ మార్పులతో ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో అదనపు ఆదాయం కూడా లభిస్తుందని పేర్కొన్నారు.
అదేవిధంగా పెద్ద బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం అనుమతించే అదనపు టికెట్ ధరలో 20 శాతం వాటాను ఎగ్జిబిటర్లకు కేటాయించేలా ఉత్తర్వుల్లో పేర్కొనాలని సూచించారు. థియేటర్లపై విధిస్తున్న కమర్షియల్ విద్యుత్ చార్జీల నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు మున్సిపల్ ఆస్తి పన్ను తగ్గించాలని కోరారు.
కాగా ఎగ్జిబిటర్ల సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ సినిమా రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు తెలుగు సంస్కృతిలో కీలక భాగమని పేర్కొంటూ ఈ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎస్. ప్రసాదరావు (అలంకార్ ప్రసాద్), సభ్యులు గోరంట్ల బాబు (ఒంగోలు), గౌరీశంకర్ రాము (గుంటూరు), భగవాన్ (ఎస్పీ థియేటర్స్ జనరల్ మేనేజర్), ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
