
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రతకు శిల్పి.. కేంద్ర మంత్రి షెకావత్
హైదరాబాద్‌లో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొని దేశ ఐక్యత కోసం పటేల్ చేసిన సేవలను కొనియాడారు. భారతదేశాన్ని ఒకే తాటిపై నిలబెట్టిన మహానేతగా సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, స్వాతంత్ర౦ అనంతరం దేశ సమగ్రతను కాపాడడంలో పటేల్ అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు.
‘భారత్ భారతి’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి షెకావత్, సర్దార్ పటేల్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడని అన్నారు. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ దేశాభివృద్ధి, జాతీయ సమగ్రత కోసం ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ జయంతి వేడుకలు కేవలం స్మరణ కార్యక్రమాలు కాకుండా దేశభక్తి, ఐక్యత విలువలను మరింత బలపరిచే సందర్భంగా నిలవాలని అభిప్రాయపడ్డారు
స్వాతంత్ర౦ వచ్చిన సమయంలో భారతదేశంలో 550కు పైగా సంస్థానాలు ఉండేవని, వాటిని భారత యూనియన్‌లో విలీనం చేయడం అత్యంత క్లిష్టమైన సవాలుగా మారిందని షెకావత్ గుర్తుచేశారు. తన దౌత్య చాతుర్యం, రాజకీయ దూరదృష్టి, ధైర్యసాహసాలతో సర్దార్ పటేల్ ఆ సంస్థానాలన్నింటినీ భారతదేశంలో విలీనం చేసి దేశ విభజన ప్రమాదాన్ని నివారించారని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో చేర్చడంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.
“భారతదేశ సమగ్రతకు ఒక వ్యక్తి చేసిన అత్యంత గొప్ప సేవను ప్రస్తావించాలంటే అది సర్దార్ పటేల్‌దే. దేశ ఐక్యతను కాపాడడంలో నిర్ణాయక పాత్ర పోషించిన నాయకుడు ఆయనే” అని షెకావత్ వ్యాఖ్యానించారు. దేశాన్ని ‘ఏక్ భారత్’గా, ‘అఖండ భారత్’గా నిలబెట్టిన పునాది పటేల్ కృషేనని ఆయన స్పష్టం చేశారు.
స్వతంత్ర భారతదేశ తొలి హోంమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను “భారత ఉక్కు మనిషి”గా గుర్తిస్తారు. దేశంలోని 550కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. దేశ సమగ్రతకు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఆయన జయంతిని ‘రాష్ట్రీయ ఏకతా దివస్’గా నిర్వహిస్తున్నారు
ఈ సందర్భంగా పలువురు నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు సర్దార్ పటేల్‌కు నివాళులర్పిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. దేశ ఐక్యత, సమగ్రత, జాతీయత విలువలను పరిరక్షించడమే పటేల్‌కు నిజమైన నివాళి అవుతుందని వక్తలు పేర్కొన్నారు
