Let's talk: editor@tmv.in
ఘనంగా ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు

ఘనంగా ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు

Panthagani Anusha
22 మే, 2026

అపార జనవాహిని, వేద మంత్రోచ్ఛారణల మధ్య సరస్వతి అంత్య పుష్కరాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు గురువారం ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగమ క్షేత్రంలో శాస్త్రోక్తంగా తొలి పుష్కర స్నాన ఘట్టాన్ని నిర్వహించారు. ఎంతో పవిత్రమైన ఈ వేడుకలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఘాట్‌లకు తరలివచ్చారు. భక్తుల రాకతో పుష్కర ఘాట్‌లన్నీ ఆధ్యాత్మిక శోభతో, కోలాహలంగా కళకళలాడాయి.

ఈ పవిత్ర అంత్య పుష్కరాల తొలి స్నాన ఘట్టంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు పాల్గొని నదీమతల్లికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. అనంతరం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ పవిత్ర స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి తదితర ప్రముఖులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అదేవిధంగా భూపాలపల్లి, రంగారెడ్డి నియోజకవర్గాల శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి పుష్కర స్నానాలు ఆచరించిన వారిలో ఉన్నారు.

పుష్కరాల కాలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అన్ని రకాల విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను నిరంతర పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవలు, ఉచిత రవాణా సదుపాయాలను ఘాట్‌ల వద్ద అందుబాటులో ఉంచారు.

పుష్కర స్నానాలు భక్తులకు సురక్షితంగా సౌకర్యవంతంగా జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఘాట్‌ల వద్దకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు, పోలీసులు సూచించిన మార్గదర్శకాలను నియమ నిబంధనలను తప్పక పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.