

నేటి నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి జూన్ 1వ తేదీ వరకు (12 రోజుల పాటు) ఈ పుష్కర స్నానాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సుమారు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం, రూ. 30.63 కోట్ల నిధులతో ఘాట్ల వద్ద భారీ మౌలిక వసతులను కల్పించింది.
పుష్కరాల తొలిరోజైన మే 21న (ఇవాళ) తెల్లవారుజామున 5.43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పవిత్ర పుష్కర స్నానం ఆచరించి ఈ అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. 12 రోజుల పాటు ప్రతిరోజూ ఒక ప్రముఖ పీఠాధిపతి ఇక్కడ పుణ్యస్నానం చేయనున్నారు. రోజూ ఉదయం హోమాలు, సాయంత్రం హారతి, తెప్పోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 1.20 కోట్లతో ప్రత్యేక మ్యూజియంను ఏర్పాటు చేయగా, రూ. 30 లక్షలతో నాగేంద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు.
భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు
గత ఏడాది ఆది పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత వేసవి తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. భక్తుల కోసం 90 షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు. 245 ఎకరాల విస్తీర్ణంలో 1.70 లక్షల వాహనాలు పార్క్ చేసేలా 23 పార్కింగ్ జోన్లను నిర్మించారు. ఘాట్లు, పార్కింగ్ ఏరియాలలో తాగునీటి సరఫరాకు రెండు ఓహెచ్‌ఆర్‌సిలను నిర్మించారు. 500 తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేసి, పారిశుద్ధ్యం కోసం 300 మంది సిబ్బందిని నియమించారు. ఎండ దెబ్బ తగలకుండా కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.
పుష్కర ఘాట్ పరిసరాల్లో 200 సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 100 మంది ప్రత్యేక శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను, సేఫ్టీ బోట్లు, లైఫ్ రింగ్స్, ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలను మోహరించారు. 23 జోన్లలో 300 మంది వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందితో మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స కోసం మహాదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెఫరల్ ఆసుపత్రిగా మార్చారు. పుష్కర విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు ఘాట్ వద్ద ప్రత్యేక మీడియా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
