
మే 21 నుంచి సరస్వతీ నది అంత్య పుష్కరాలు.. కాళేశ్వరంలో భారీ ఏర్పాట్లు
తెలంగాణలోని జయశంకర్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆమె ఈ పుష్కరాల అధికారిక పోస్టర్, టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కోండా సురేఖ మాట్లాడుతూ.. 12 రోజుల పాటు కొనసాగే ఈ పుష్కరాలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 162 అభివృద్ధి పనుల కోసం రూ.30.63 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భక్తులు ప్రశాంతంగా స్నానం చేసి, స్వామివారి దర్శనం చేసుకునేలా సమగ్ర సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. సుమారు 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తరువాత సరస్వతి ఆది పుష్కరాలు, సమ్మక్క-సారలమ్మ జాతర వంటి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని ఆమె గుర్తుచేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి డి. శ్రీధర్ బాబు అధికారులను ఉద్దేశించి, అన్ని ఏర్పాట్లను కనీసం 10 రోజుల ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. విభాగాల మధ్య సమన్వయం కీలకమని, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వర ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.198 కోట్లు కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, మొదటి రోజు ఉదయం 5:43 గంటలకు శంకర విజయేంద్ర సరస్వతి చేత పుణ్యస్నానం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వానం పంపినట్లు తెలిపారు. ప్రతిరోజూ ఒక శీర్ ద్వారా పుణ్యస్నానం నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అలాగే, కాశీ పండితుల ఆధ్వర్యంలో సాయంత్రం 6:30 గంటలకు త్రివేణి సంగమంలో హారతి నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
