Let's talk: editor@tmv.in
శతక్కొట్టిన సంజు.. ముంబైపై చెన్నై ఘన విజయం
శతక్కొట్టిన సంజు.. ముంబైపై చెన్నై ఘన విజయం

శతక్కొట్టిన సంజు.. ముంబైపై చెన్నై ఘన విజయం

Shaik Mohammad Shaffee
24 ఏప్రిల్, 2026

ఐపీఎల్‌లో అత్యంత క్రేజ్ ఉన్న 'ఎల్ క్లాసికో' పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విశ్వరూపం చూపింది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకపక్ష పోరులో ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే 103 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. సంజు శాంసన్‌ (101 నాటౌట్) అజేయ శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం.

సెంచరీతో చెలరేగిన సంజు

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22) శుభారంభం ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్లలో రుతురాజ్, శాంసన్‌ పోటాపోటీగా బౌండరీలు బాదారు. అయితే గజన్‌ఫర్ బౌలింగ్‌లో రుతురాజ్ అవుట్ కావడంతో చెన్నై ఇబ్బందుల్లో పడింది. సొంతగడ్డపై ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ (14), శివమ్ దూబే (5) విఫలమైనా.. సంజు శాంసన్‌ మాత్రం మొండిగా నిలబడ్డాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో ఆడిన సంజు, కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది శాంసన్‌కు ఈ సీజన్‌లో రెండో సెంచరీ కాగా, ఐపీఎల్ కెరీర్‌లో ఐదో శతకం. ముంబై బౌలర్లలో బుమ్రా (1/31) మాత్రమే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

ముంబైకి 'అకీల్' షాక్

208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని చెన్నై స్పిన్నర్ అకీల్ హొస్సేన్ కోలుకోలేని దెబ్బ తీశాడు. తాను వేసిన తొలి ఓవర్లోనే మలేవార్‌ (0)ను అవుట్ చేసిన అకీల్, తర్వాత నమన్ ధీర్‌ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మధ్యలో ముఖేష్ చౌదరి.. డికాక్‌ (7)ను వెనక్కి పంపడంతో ముంబై 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ (37), సూర్యకుమార్ యాదవ్ (36) నాలుగో వికెట్‌కు 73 పరుగులు జోడించినా, అది కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే సరిపోయింది. అకీల్ హొస్సేన్ (4/17) తన స్పెల్‌లో తిలక్, సూర్య వికెట్లను కూడా తీసి ముంబై బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో హార్దిక్ పాండ్యా (1), రూథర్‌ఫర్డ్ (0)లను అవుట్ చేయడంతో ముంబై పతనం పూర్తయింది.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి మాతృమూర్తి ఇటీవల కన్నుమూశారు. ఆమెకు సంతాపంగా, ముఖేష్‌కు అండగా నిలుస్తూ సీఎస్‌కే సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత బాధలో ఉన్నప్పటికీ ముఖేష్ బరిలోకి దిగి ఒక వికెట్ సాధించడం విశేషం.