
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ అమలు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యుత్తమ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘సంజీవని’ కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కండ్రిగలో నిర్వహించిన ‘సంజీవని’ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2025 జూలైలో కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ వినూత్న డిజిటల్ ఆరోగ్య విధానాన్ని రాబోయే స్వాతంత్ర దినోత్సవం కానుకగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో మార్చి 15 నుంచి అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 19.75 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అత్యాధునిక డిజిటల్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్
‘సంజీవని’ అనేది కేవలం ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ కాదని ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్’ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. రామ-రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతం లాగే, ఈ వ్యవస్థ కూడా ప్రజల ప్రాణాలను రక్షిస్తుందనే నమ్మకంతోనే దీనికి ఆ పేరు పెట్టామని గుర్తుచేశారు. ఈ విధానం ద్వారా ప్రజల వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను సురక్షితంగా డిజిటల్ రూపంలో భద్రపరుస్తామని, తద్వారా డాక్టర్ అపాయింట్‌మెంట్‌లు వర్చువల్ కన్సల్టేషన్లు తక్షణ వైద్య సలహాలు లభిస్తాయని చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే ఈ వ్యవస్థలో ‘ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డాక్టర్’ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
అదేవిదంగా ప్రిడిక్టివ్ (ముందస్తు అంచనా), ప్రివెంటివ్ (నివారణ), క్యూరేటివ్ (చికిత్స) అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా సంజీవని పనిచేస్తుందని. వ్యాధులు రాకముందే ప్రజలను అప్రమత్తం చేయడం ముందస్తుగా చికిత్సలు అందించడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం నేరుగా ప్రజల ఇంటి వద్దకే వచ్చి 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించేలా చర్యలు చేపట్టిందని వెల్లడించారు.
వైద్యరంగానికి రూ.19,305 కోట్లు.. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం
వైద్య ఖర్చులు భరించలేక అనేక కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఇబ్బందుల నుంచి పేదలను గట్టెక్కించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది బడ్జెట్‌లో వైద్యరంగానికి ఏకంగా రూ.19,305 కోట్లు కేటాయించామని చెప్పారు. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నుంచి దేశంలోనే అత్యధికంగా రూ.2,601 కోట్ల ఆరోగ్య గ్రాంట్లు పొందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని సీఎం ప్రకటించారు.
ఇక యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ రూ.2.5 ఆ లక్షల విలువైన వైద్య సేవలు అందిస్తామని, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చులు భరించేలా చారిత్రాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేసి ప్రజారోగ్యాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.
ఆహారమే ఔషధం – వంటశాలే ఔషధశాల
ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉన్నవారే నిజమైన అదృష్టవంతులు అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ప్రజలు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు. మంచి ఆహార అలవాట్లు, రోజువారీ వ్యాయామం, యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవర్చుకోవాలన్నారు. ‘ఆహారమే ఔషధం–వంటశాలే ఔషధశాల’ అనే ప్రాచీన భారతీయ భావనను తాము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణతో పెరిగిన భూగర్భ జలాలు
ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంరక్షణ, జల నిర్వహణ చర్యల వల్ల అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో 8.5 మీటర్ల మేర పెరిగాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనివల్ల జిల్లాలో పచ్చదనం పెరిగి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని నివేదికలు చెబుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఎండలు, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ పర్యావరణ సమతుల్యత వల్ల అన్నమయ్య జిల్లాలో మాత్రం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషమన్నారు.
2028 నాటికి సాగునీటి ప్రాజెక్టుల పూర్తి
రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. నీవా ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి పూతలపట్టు నుంచి చిత్తూరు వరకు కృష్ణా జలాలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణి డ్యాంకు నీళ్లు అందించడంతో పాటు శ్రీశైలం నుంచి తిరుపతి వరకు నీటి సరఫరాను విస్తరిస్తామన్నారు. అదేవిధంగా గాలేరు-నగరి, మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ వంటి కీలక ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గట్టి సంకల్పంతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
