
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు ఖరారు
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు జూన్ 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరిస్తారు.
సంజయ్ జాజు ప్రస్తుతం కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. గతంలో ఆయన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా పలు కీలక విభాగాల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. సంజయ్ జాజు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిశ్రమలు, వాణిజ్య శాఖ, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ (ఐటీఈ&సీ) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) కూడా కొనసాగిస్తారని ప్రభుత్వం తెలిపింది. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈఓతో పాటు స్పీడ్ వ్యవస్థకు సంబంధించిన బాధ్యతలను కూడా ఆయన నిర్వహించనున్నారు.
ఈ నూతన ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంజయ్ జాజుతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు జయేశ్‌రంజన్, వికాస్ రాజ్ పేరును కూడా సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. చివరికి సంజయ్ జాజు వైపే ఆయన మొగ్గు చూపారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా పని చేశారు. 2014 అక్టోబర్ వరకు పనిచేసిన అనంతరం కేంద్ర డిప్యుటేషన్‌కు వెళ్లిన సంజయ్ జాజు, దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తిరిగి రాష్ట్ర సేవలో చేరారు. సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి సర్వీస్ లో ఉండనున్నారు.
రామకృష్ణారావుకు సలహాదారు పదవి
ఇదే సమయంలో, జూన్ 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రికి సలహాదారుగా, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.
మరోవైపు, ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారుల బాధ్యతల్లో మార్పులు చేపట్టింది. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు విభాగం, సీఎస్‌ఆర్ విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సబ్యసాచి ఘోష్‌కు చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది. అలాగే అటవీ శాఖలో వన్యప్రాణుల విభాగం ప్రధాన అటవీ సంరక్షణాధికారి, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌గా ఉన్న వినయ్ కుమార్‌కు ప్రధాన అటవీ సంరక్షణాధికారి హోదా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
