
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌తో పాటు ఈ కేసులోని ఇతర నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జూన్ 22న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ ఉదంతంపై హైదరాబాద్ పోలీసులు గతంలోనే కోర్టులో 23 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. డిసెంబర్ 24న దాఖలైన ఈ చార్జ్‌షీట్‌ను పరిశీలించిన అనంతరం, కోర్టు అల్లు అర్జున్ సహా మొత్తం 23 మంది నిందితులకు సమన్లు జారీ చేస్తూ, జూన్ 22న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. చార్జ్‌షీట్‌లో సంధ్యా థియేటర్ యజమాని, భాగస్వాములు, మేనేజర్, లోయర్-బాల్కనీ ఇన్‌ఛార్జ్, గేట్‌కీపర్‌లను ఏ1 నుంచి ఏ10వ నిందితులుగా చేర్చగా, నటుడు అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
డిసెంబర్ 4, 2024న సంధ్యా థియేటర్ వద్ద ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె 8 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్, అతని భద్రతా సిబ్బంది, థియేటర్ యాజమాన్యంపై భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అల్లు అర్జున్‌ను డిసెంబర్ 13, 2024న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజే తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ ఘోర ప్రమాదం జరిగిన తర్వాత, గాయపడిన బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ చిత్ర బృందం ఆర్థిక సహాయం అందించింది. అలాగే, తెలంగాణ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసాను ప్రకటించింది.
