
సంధ్య థియేటర్ కేసు.. వర్చువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఎదుట వర్చువల్‌గా (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) హాజరయ్యారు. డిసెంబర్ 2024లో ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన కేసుకు సంబంధించి కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు ఆయన హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 29కి వాయిదా వేసింది.
హైదరాబాద్ పోలీసులు డిసెంబర్ 2025లో ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్‌తో సహా మొత్తం 23 మంది నిందితులపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సోమవారం కోర్టు విచారణ సందర్భంగా నిందితులకు ఈ చార్జ్‌షీట్ ప్రతులను అందజేశారు. ఈ కేసులోని 23 మంది నిందితులలో కొందరు సోమవారం విచారణకు హాజరుకాలేదు. అంతకుముందు జూన్ 22న కూడా సమన్ల ప్రకారమే అల్లు అర్జున్ కోర్టుకు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ చార్జ్‌షీట్‌లో సంధ్యా థియేటర్ యజమాని, భాగస్వాములు, మేనేజర్, లోయర్-బాల్కనీ ఇన్‌ఛార్జ్, గేట్‌కీపర్‌లను 1 నుంచి 10వ నిందితులుగా చేర్చగా.. హీరో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా పేర్కొన్నారు.
డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో 'పుష్ప 2' ప్రీమియర్ ప్రదర్శన జరిగింది. ఆ సమయంలో తన అభిమాన హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ తోపులాటలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక 35 ఏళ్ల మహిళ మరణించగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్, థియేటర్ యాజమాన్యంపై ‘భారతీయ న్యాయ సంహిత’ లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అల్లు అర్జున్‌ను డిసెంబర్ 13, 2024న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరుసటి రోజే తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది. ఘటన అనంతరం నటుడు అల్లు అర్జున్, 'పుష్ప 2' చిత్ర బృందం బాధిత కుటుంబానికి, గాయపడిన బాలుడికి భారీ ఆర్థిక సహాయాన్ని అందించారు. వీరితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది.
