
సంధ్య థియేటర్ కేసు.. వర్చువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
డిసెంబర్ 2024లో సంధ్యా థియేటర్‌లో 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన నెపంతో నమోదైన కేసులో టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి కోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యారు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు ఆయన విచారణకు హాజరై తన ఉనికిని చాటుకోగా, ఈ కేసులోని మిగిలిన నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది.
ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు డిసెంబర్ 2025లో అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మంది నిందితులపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, నిందితులందరినీ సోమవారం తమ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో సంధ్యా థియేటర్ యజమాని, భాగస్వాములు, మేనేజర్, లోయర్-బాల్కనీ ఇన్‌ఛార్జ్, గేట్‌కీపర్‌లను 1 నుంచి 10వ నిందితులుగా చేర్చగా.. నటుడు అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా పేర్కొన్నారు.
ఘటన నేపథ్యం..
డిసెంబర్ 4, 2024న థియేటర్ వద్ద 'పుష్ప 2' ప్రీమియర్ షో సమయంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల ఒక మహిళ మరణించగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్, థియేటర్ యాజమాన్యంపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అల్లు అర్జున్‌ను డిసెంబర్ 13, 2024న పోలీసులు అరెస్ట్ చేయగా, మరుసటి రోజే తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది. మానవతా దృక్పథంతో అల్లు అర్జున్, 'పుష్ప 2' చిత్ర బృందం మరణించిన మహిళ కుటుంబానికి, గాయపడిన బాలుడికి ఆర్థిక సహాయం అందించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
