
రష్యా, ఇరాన్ చమురుపై మళ్లీ ఆంక్షలు.. అమెరికా కీలక ప్రకటన
రష్యా, ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు కొనుగోళ్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికా తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. ఆయా దేశాలపై ఉన్న ఆంక్షల నుంచి గతంలో ఇచ్చిన మినహాయింపులను ఇకపై పొడిగించే ప్రసక్తే లేదని వాషింగ్టన్ స్పష్టం చేసింది. బుధవారం వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ కీలక ప్రకటన చేశారు.
మినహాయింపుల గడువు ముగింపు
రష్యా, ఇరాన్ చమురు రవాణాకు సంబంధించి ఇచ్చిన జనరల్ లైసెన్స్‌లను పునరుద్ధరించబోమని బెసెంట్ తేల్చి చెప్పారు. "మార్చి 11వ తేదీ కంటే ముందు సముద్ర మార్గంలో ఉన్న చమురు రవాణాకు మాత్రమే గతంలో అనుమతి ఇచ్చాం. ఆ గడువు ఇప్పటికే ముగిసింది, ఆ సరుకు కూడా వినియోగించబడింది. కాబట్టి ఇకపై కొత్తగా మినహాయింపులు ఉండవు" అని ఆయన వివరించారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను మరింత పటిష్టంగా అమలు చేయడమే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్‌కు 30 రోజుల వెసులుబాటు
గత నెలలో (మార్చి 5న) భారత్‌కు అమెరికా ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడకుండా, ధరలు పెరగకుండా ఉండేందుకు భారత్‌కు 30 రోజుల పాటు రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అనంతరం మరికొన్ని దేశాలకు కూడా ఈ మినహాయింపును వర్తింపజేసింది. అయితే ఏప్రిల్ 11తో ఈ గడువు ముగియడంతో, ఇప్పుడు అమెరికా మళ్లీ ఆంక్షలను కఠినతరం చేసింది.
మార్చిలో భారత్ భారీగా చమురు కొనుగోళ్లు
యూరోపియన్ థింక్ ట్యాంక్ 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్' నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి నెలలో కాస్త తగ్గిన భారత్ చమురు దిగుమతులు, మార్చిలో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఫిబ్రవరిలో కేవలం 1.8 బిలియన్ యూరోలుగా ఉన్న దిగుమతులు, మార్చి వచ్చేసరికి ఏకంగా 5.8 బిలియన్ యూరోలకు (దాదాపు మూడు రెట్లు) చేరడం విశేషం. భారత్ కొన్న ఈ మొత్తం ఇంధనంలో 91 శాతం వాటా కేవలం ముడి చమురుదే కావడం గమనార్హం. దీని విలువ సుమారు 5.3 బిలియన్ యూరోలుగా ఉంది. చమురుతో పాటు బొగ్గు, ఇతర పెట్రోల్ ఉత్పత్తులను కూడా భారత్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంది. అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నప్పటికీ, భారత్ తన అవసరాల కోసం రష్యాపైనే ఎక్కువ మొగ్గు చూపినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.
మార్కెట్ స్థిరీకరణ కోసమే ఆనాడు..
గతంలో భారత్‌కు మినహాయింపు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ వివరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా ఆగిపోతుందనే భయాలను పోగొట్టేందుకు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలను స్థిరీకరించేందుకు మాత్రమే ఆనాడు భారత్‌ను చమురు కొనమని కోరామని ఆయన గుర్తు చేశారు. అది కేవలం తాత్కాలిక నిర్ణయమే తప్ప, రష్యా పట్ల అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
