Let's talk: editor@tmv.in
జీతాల పెంపు కోరుతూ శాంసంగ్ కార్మికుల భారీ ర్యాలీ

జీతాల పెంపు కోరుతూ శాంసంగ్ కార్మికుల భారీ ర్యాలీ

Shaik Mohammad Shaffee
24 ఏప్రిల్, 2026

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పుణ్యమా అని మెమొరీ చిప్స్ విక్రయాల్లో కాసుల వర్షం కురుస్తున్నా.. ఆ ప్రతిఫలం తమకు అందడం లేదని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల పెంపు, పారదర్శకమైన బోనస్ విధానం కోసం డిమాండ్ చేస్తూ గురువారం దక్షిణ కొరియాలోని ప్యోంగ్‌టెక్ కంప్యూటర్ చిప్ కాంప్లెక్స్ వద్ద వేలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యం తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో మే 21 నుంచి భారీ సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

"బోనస్‌లపై గరిష్ట పరిమితులను తొలగించండి.. పరిహారం చెల్లింపుల్లో పారదర్శకత పాటించండి" అంటూ కార్మికులు నినదించారు. శాంసంగ్ యూనియన్ ప్రతినిధుల కథనం ప్రకారం.. దాదాపు 40,000 మంది సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కంపెనీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, కార్మికులకు ఇచ్చే బోనస్‌లపై సీలింగ్ విధించడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్టాక్ ఆప్షన్ల రూపంలో బోనస్ ఇస్తామన్న యాజమాన్యం ప్రతిపాదనను యూనియన్ తిరస్కరించింది.

ఈ నిరసన ప్రదర్శన శాంసంగ్ ప్రత్యర్థి సంస్థ 'ఎస్‌కే హైనిక్స్’ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన కొన్ని గంటలకే జరగడం గమనార్హం. ఎస్‌కే హైనిక్స్ జనవరి-మార్చి త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ప్రకటించింది. డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల కోసం మెమొరీ చిప్స్‌కు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. మరోవైపు శాంసంగ్ సైతం ఈ త్రైమాసికంలో 57.2 ట్రిలియన్ వాన్ల (సుమారు 38.6 బిలియన్ డాలర్లు) ఆపరేటింగ్ ప్రాఫిట్‌ను అంచనా వేస్తోంది. ఇంతటి భారీ లాభాల్లో కార్మికులకు సరైన వాటా ఇవ్వడం లేదన్నదే యూనియన్ ప్రధాన ఆరోపణ.

సమ్మె జరిగితే భారీ నష్టం!

యూనియన్ నేత చోయ్ సీంగ్-హో మాట్లాడుతూ.. "మా న్యాయమైన డిమాండ్లు తీరే వరకు ఈ పోరాటం ఆగదు" అని స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు విఫలమై, మే 21 నుంచి 18 రోజుల పాటు సమ్మె జరిగితే శాంసంగ్‌కు రోజుకు దాదాపు 1 ట్రిలియన్ వాన్ల (సుమారు 676 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని యూనియన్ హెచ్చరించింది. 74,000 మంది సభ్యులున్న ఈ యూనియన్ సమ్మెకు దిగితే అంతర్జాతీయ చిప్ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ముంచుకొస్తున్న ముడిసరుకుల కొరత

ఒకవైపు కార్మికుల ఆందోళనలు శాంసంగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు భౌగోళిక రాజకీయ పరిస్థితులు పరిశ్రమను భయపెడుతున్నాయి. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చిప్ తయారీకి కీలకమైన 'హీలియం' వంటి వాయువుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు పెరుగుతున్న ఇంధన ధరలు కూడా కంపెనీకి సవాలుగా మారాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శాంసంగ్ యాజమాన్యం కార్మికులతో ఎలా రాజీకి వస్తుందనేది ఇప్పుడు ప్రపంచ టెక్ మార్కెట్‌లో ఆసక్తికరంగా మారింది.