Let's talk: editor@tmv.in
బీహార్ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం
బీహార్ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం

బీహార్ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం

Pinjari Chand
16 ఏప్రిల్, 2026

బీజేపీ నేత సమ్రాట్‌ చౌదరి బుధవారం బీహార్ రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో బీజేపీకి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. పాట్నాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్‌ అతా హస్నైన్‌ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌‌, కేంద్ర మంత్రి జేపీ.నడ్డా , ఎల్జేపీ (ఆర్‌వీ) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

జేడీయూ నేతలకు మంత్రి పదవులు

ఈ సందర్భంగా జేడీయూ నేతలు బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్, విజయ్‌కుమార్‌‌ చౌదరి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మోడీ అభినందనలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమ్రాట్ చౌదరికి అభినందనలు తెలిపారు. ఆయన ఉత్సాహం, ప్రజాసేవ పట్ల నిబద్ధత, గ్రామీణ స్థాయిలో అనుభవం బీహార్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

మోడీ–నితీశ్ మోడల్ పాలన

ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన సమ్రాట్ చౌదరి, బీహార్‌లో ‘మోడీ–నితీశ్ మోడల్’ పాలన కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వెంటనే పనులు ప్రారంభిస్తానని చెప్పారు. 57 ఏళ్ల సమ్రాట్ చౌదరి దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే బీజేపీలో చేరి కేవలం తొమ్మిదేళ్లలోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఆయన రాజకీయ జీవితంలో కీలక ఘట్టంగా మారింది.

కేబినెట్ విస్తరణపై చర్చ

ప్రస్తుతం మంత్రివర్గంలో వివిధ సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో త్వరలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలు పేర్కొన్నాయి. సమ్రాట్ చౌదరి ఓబీసీ వర్గానికి చెందిన కోయరి సమాజానికి చెందినవారు. ఈ వర్గం బీహార్ రాజకీయాల్లో ప్రభావం కలిగి ఉండటంతో ఆయన ఎంపికకు ఇది ఒక కారణంగా భావిస్తున్నారు.

అభినందనలు వెల్లువ

సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారంపై ఎన్డీయే నేతలు అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో బీహార్ వేగంగా అభివృద్ధి దిశగా సాగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ కూడా చౌదరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నాయకత్వంలో బీహార్ మరింత అభివృద్ధి సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ ఎన్డీయే భాగస్వామ్యంతో ప్రధాని మోడీ లక్ష్యమైన ‘వికసిత్ భారత్’ సాధనలో బీహార్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇక సమ్రాట్ చౌదరి తండ్రి శకుని చౌదరి తన కుమారుడు ముఖ్యమంత్రిగా ఎదగడం దేవుని కృపగా అభివర్ణించారు.

తేజస్వీ యాదవ్‌ అభినందనలు

బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరికి ఎన్డీయే నేతలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీయాదవ్‌ వ్యంగ్య వ్యాఖ్యలతో స్పందించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో యాదవ్ మాట్లాడుతూ ‘ఎన్నికైన’ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌‌ను అధికారంలో నుంచి తొలగిస్తానన్న తన ప్రతిజ్ఞను నెరవేర్చినందుకు సమ్రాట్ చౌదరి జీకి అభినందనలు. అలాగే ‘ఎంపికైన’ ముఖ్యమంత్రి కాబోతున్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు.

అలాగే ఎన్డీయే పాలనకు 21 సంవత్సరాలు పూర్తైనా, నీతి ఆయోగ్‌ సూచికల్లో బీహార్ జాతీయ సగటు కంటే వెనుకబడి ఉన్న ‘చేదు, కఠినమైన వాస్తవం’ గురించి చౌదరి తెలుసుకుని పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. కొత్త ముఖ్యమంత్రి బీహార్ ప్రజల గౌరవాన్ని కాపాడుతూ స్వతంత్రంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు కూడా వ్యాఖ్యానించారు.ఇక బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమ్రాట్ చౌదరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ సరోగి కూడా అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.