Let's talk: editor@tmv.in
బీహార్ తొలి బీజేపీ సీఎం‌గా సమ్రాట్ చౌదరి
బీహార్ తొలి బీజేపీ సీఎం‌గా సమ్రాట్ చౌదరి

బీహార్ తొలి బీజేపీ సీఎం‌గా సమ్రాట్ చౌదరి

Pinjari Chand
15 ఏప్రిల్, 2026

బీహార్‌లో బీజేపీ శాసనసభ పక్ష నేతగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కేంద్ర మంత్రి, పార్టీ కేంద్ర పరిశీలకుడు శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ప్రకటించారు. ఈ సందర్భాన్ని “భావోద్వేగభరితమైన, చారిత్రాత్మక క్షణం’గా ఆయన అభివర్ణించారు. పాట్నాలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసంఘ్ కాలం నుంచి బీజేపీని నిర్మించిన కార్యకర్తల కలలు ఈ రోజు నిజమయ్యాయని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తల సంకల్పం నెరవేరిన రోజు ఇదని పేర్కొంటూ సమ్రాట్‌ చౌదరికి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా సమ్రాట్‌ చౌదరికి బంధువైన రామ్ చంద్ర సింగ్ ఈ పరిణామాన్ని ‘ఆనంద తరంగం’గా అభివర్ణించారు. 2000 సంవత్సరంలో చౌదరి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు. స్వాతంత్ర౦ తర్వాత తమ నియోజకవర్గానికి కావలసిన ప్రతినిధి అప్పుడే దొరికాడని అన్నారు.

బీహార్‌‌కు తొలి బీజేపీ సీఎం

సమ్రాట్‌ చౌదరి బీహార్‌లో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న తొలి నేతగా నిలవనున్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీశ్‌కుమార్‌‌ రాజీనామా చేయడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. నితీశ్ కుమార్ పాట్నాలోని లోక్ భవన్‌లో గవర్నర్ సయ్యద్‌ అతా హస్నైన్‌కు తన రాజీనామాను సమర్పించారు. ఏప్రిల్‌ 10న ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ రాజీవ్‌ప్రతాప్‌ రూడీ మాట్లాడుతూ, నితీశ్ కుమార్ అధికార బదిలీ చేయడం ఆయన గొప్పతనాన్ని చూపిందని అన్నారు. ఇది బీహార్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో నితీశ్ కుమార్ కూటమి రాజకీయాలను సమర్థంగా నిర్వహించడం వల్లనే ఎన్డీఏ బీహార్‌లో అధికారంలో కొనసాగగలిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్​వాహా సమ్రాట్‌ చౌదరికి కొత్త బాధ్యతలపై అభినందనలు తెలిపారు.

సమ్రాట్ చౌదరి రాజకీయ ప్రయాణం

ముంగేర్‌‌ జిల్లాలోని తారాపూర్‌‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన 57 ఏళ్ల సమ్రాట్ చౌదరి రాజకీయ జీవితం దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సాగింది. ఆయన మొదట రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌‌జేడీ)లో రాజకీయాలు ప్రారంభించి 1999లో అప్పటి ముఖ్యమంత్రి రబ్రీదేవి మంత్రివర్గంలో చోటు పొందారు. అయితే అప్పుడు ఆయన వయస్సు 25 సంవత్సరాలు పూర్తి కాలేదనే కారణంతో గవర్నర్ సురాజ్‌భాన్‌ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. తరువాత 2000 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ మంత్రిగా పనిచేశారు.

2014లో ఆర్జేడీ నుంచి విడిపోయి జేడీయూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చౌదరి, 2017లో బీజేపీలో చేరారు. కొద్ది కాలంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగి కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు.

2024లో ఎన్డీఏ విజయం సాధించిన తర్వాత ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అనంతరం హోం శాఖ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం పెరిగింది.

సమ్రాట్ చౌదరి కుటుంబ నేపథ్యం, విద్య వివరాలు

బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న సమ్రాట్‌ చౌదరి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి శకుని చౌదరి బీహార్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు. ముంగేర్ జిల్లాలోని తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం పార్లమెంట్ సభ్యుడిగానూ పనిచేశారు. సమ్రాట్ చౌదరి తల్లి పార్వతి దేవి కూడా రాజకీయాల్లో చురుకుగా పాల్గొని బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో సమ్రాట్ చౌదరి చిన్ననాటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగారు. సమ్రాట్ చౌదరి వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకురాలేదు. ఆయన భార్య వివరాలు ప్రజలకు పెద్దగా తెలియవు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో సమాచారం. మొత్తంగా ఆయన కుటుంబం బీహార్‌లో బలమైన రాజకీయ ప్రభావం కలిగిన కుటుంబంగా గుర్తింపు పొందింది.

విద్య

సమ్రాట్ చౌదరి ఉన్నత విద్యను మధురై కామరాజ్‌ యూనివర్సిటీలో అభ్యసించనని ఓ ఇంటర్వ్యూలో ఆయనే తెలిపారు. అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఇతర ముఖ్య వివరాలు

సమ్రాట్ చౌదరి అసలు పేరు రాకేష్ కుమార్. సామాజికంగా ప్రభావం ఉన్న కోయరి/కుష్వాహా ఓబీసీ వర్గానికి చెందిన ఆయన రాజకీయంగా కూడా ఆ వర్గంలో బలమైన ఆధారాన్ని కలిగి ఉన్నారు.

రాజకీయంగా మొదట ఆర్‌‌జేడీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సమ్రాట్ చౌదరి తరువాత జనతాదళ్‌(యునైటెడ్‌)తో అనుబంధం ఏర్పరుచుకున్నారు. 2017లో ఆయన బీజేపీలో చేరి కొద్ది కాలంలోనే పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు.

ప్రతిపక్షం విమర్శలు

బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ సమ్రాట్ చౌదరిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చౌదరి లాలూ జీ స్కూల్ నుంచి వచ్చిన నాయకుడని వ్యాఖ్యానిస్తూ ఆయనకు ప్రజల ఆమోదం లేదని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు.

బీజేపీ శిబిరంలో ఆనందం

సమ్రాట్ చౌదరి సీఎం అవుతారనే వార్తతో బీజేపీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశాలకు కేంద్ర మంత్రులు గిరిరాజ్‌సింగ్‌, నిత్యానంద్‌ రాయ్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్‌‌ ప్రసాద్, రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, రాధామోహన్‌సింగ్‌ హాజరయ్యారు. అలాగే 2005 నుంచి పదే పదే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్ బీహార్ చరిత్రలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

బీహార్ అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఎన్డీఏకి చెందిన అన్ని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సమ్రాట్ చౌదరీ పేరును ఆమోదించారు. సమావేశానికి స్పీకర్ ప్రేమ్‌కుమార్‌‌తో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం అనంతరం సమ్రాట్ చౌదరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌తావ్డేతో కలిసి గవర్నర్‌‌ను కలుసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. గవర్నర్ నివాసమైన లోక్ భవన్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఎన్డీఏ వర్గాల సమాచారం ప్రకారం తొలుత చిన్న మంత్రివర్గంతో ప్రభుత్వం ఏర్పడి, వచ్చే నెలలో విస్తరణ జరిగే అవకాశం ఉంది.

నిశాంత్‌పై ఊహాగానాలు

జేడీయూ వర్గాల సమాచారం ప్రకారం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్‌ కుమార్‌‌ ఇటీవల పార్టీలో చేరినా ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి చూపలేదని, పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారని చెప్పారు.

సీఎంగా నితీశ్‌కుమార్ చివరి సమావేశం

ఇదిలా ఉండగా నితీశ్ కుమార్ మంగళవారం చివరిసారిగా ముఖ్యమంత్రిగా పాత సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశానికి ముందు భారతరత్న బీఆర్‌‌.అంబేద్కర్‌‌ 135వ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించారు. అలాగే జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌కుమార్ ఝా మాట్లాడుతూ నితీశ్ కుమార్ నాయకత్వంలో బీహార్ రాజకీయాలు కొత్త దిశలో ముందుకు సాగాయని అన్నారు. ఆయన పాలనతో రాష్ట్ర ప్రజల గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రభుత్వాలు కూడా నితీశ్ కుమార్ మార్గదర్శకత్వంలోనే కొనసాగుతాయని తెలిపారు. ఇదే సమయంలో నితీశ్ కుమార్ దీర్ఘకాలంగా కోరుకున్న లక్ష్యం అయిన అన్ని సభలలో సభ్యత్వం పొందాలన్న ఆశ కూడా నెరవేరింది. ఆయన ఇప్పటికే బీహార్ అసెంబ్లీ, బీహార్ శాసన మండలి, లోక్‌సభ సభ్యుడిగా పనిచేసి, ఇప్పుడు రాజ్యసభలోకి ప్రవేశించారు. ఈ మార్పుతో బీహార్‌లో అధికార సమీకరణాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. రాబోయే ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

బీహార్ తొలి బీజేపీ సీఎం‌గా సమ్రాట్ చౌదరి - Tholi Paluku