
సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. ‘సిట్’ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అక్రమ నిర్బంధం, కస్టడీ హత్య ఆరోపణల కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఘాటైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సస్పెండ్ అయిన కృష్ణా లంక పోలీస్ ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై వస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అయితే, ఈ ‘సిట్’ తన నివేదికను సమర్పించడానికి ఎలాంటి సమయపరిమితిని ప్రభుత్వం విధించలేదు.
గత కొన్ని రోజులుగా గాదె సాయికృష్ణ కనిపించకుండా పోవడం అనే ఉదంతం ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తోంది. విజయవాడ కృష్ణా లంక పోలీస్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తన కుమారుడిని అక్రమంగా నిర్బంధించి, కస్టడీలో హింసించి చంపేశాడని సాయికృష్ణ తల్లి ఆరోపించారు. అంతేకాకుండా, కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని కాకుండా దహనం చేసి సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు.
ఈ కేసు తీవ్రత పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆదివారం అధికారికంగా జీవో జారీ చేసింది. సస్పెండ్ అయిన ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై వచ్చిన అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, హత్య, సాక్ష్యాల విధ్వంసం వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. ఈ కేసులో పారదర్శకమైన, నిష్పక్షపాతమైన, నమ్మదగిన దర్యాప్తును నిర్ధారించడానికి ప్రభుత్వం 'సిట్'ను ఏర్పాటు చేసింది.
సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదైన తర్వాత, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పంపిన ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సంబంధిత కఠినమైన సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.
‘సిట్’ బృంద సభ్యులు
ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐజీ ఎం. రవిప్రకాష్ నాయకత్వం వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, బాపట్ల అదనపు ఎస్పీ ఎల్. సుధాకర్ ఈ బృందంలో కీలక అధికారులు సభ్యులుగా ఉన్నారు.
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం లభించే అన్ని దర్యాప్తు అధికారాలను ఈ 'సిట్' బృందం వినియోగించుకుంటుందని ప్రభుత్వం తెలిపింది. బృందంలోని ఒకరిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమించే అధికారం, సాంకేతిక, ఫోరెన్సిక్ సహాయాన్ని పొందే స్వేచ్ఛను సిట్ హెడ్‌కు కల్పించారు. సిట్ దర్యాప్తునకు అవసరమైన కార్యాలయ వసతి, మౌలిక సదుపాయాలు, ఇతర రవాణా సౌకర్యాలను కల్పించాల్సిందిగా డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు ఈ బృందానికి పూర్తి స్థాయిలో సహకరించాలని, చట్టప్రకారం ఈ విచారణను వీలైనంత వేగంగా ముగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
