
సాయికృష్ణ కస్టడీ మృతి కేసు.. సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలి: వైసీపీ నేత మనోహర్ రెడ్డి
గాదె సాయికృష్ణ కస్టడీ మృతి కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా సాగడం లేదని, ఘటనకు బాధ్యులైన వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని, అలాగే పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని వెంటనే వెలికితీయాలని డిమాండ్ చేసింది.
శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదని ప్రభుత్వ వాదన కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రస్తుతం పోలీస్ శాఖ అత్యాధునిక ఏఐ సాంకేతికత కలిగిన కెమెరాలు వినియోగిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, ఫుటేజీ లేకపోవడం లేదా కెమెరాలు పనిచేయలేదని చెప్పడం విశ్వసనీయంగా లేదన్నారు.
కస్టడీ మరణాల వంటి ఘటనల్లో సీసీటీవీ దృశ్యాలను భద్రపరచి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ ఈ కేసులో ఆ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. పోలీసులు తమ సహచరులపైనే విచారణ నిర్వహిస్తుండటంతో నిజాలు వెలుగులోకి రావడం కష్టమని, స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో దర్యాప్తు జరిపితేనే వాస్తవాలు బయటపడతాయని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక కేసులకే టాస్క్‌ఫోర్స్‌ను వినియోగిస్తారని, అయితే ఈ ఘటనలో విజయవాడ కమిషనరేట్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ మార్కాపురానికి వెళ్లి సాయికృష్ణను తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు అప్పగించిందని తెలిపారు. అక్కడ ఆయనపై హింస జరిగిందని, ఇప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.
అంతేకాకుండా, రిమాండ్ రిపోర్టులో కెమెరాలు ఎందుకు పనిచేయలేదనే అంశంపై ఫిర్యాదు నమోదైందా లేదా, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఎంతమంది సిబ్బందిని విచారించారనే కీలక వివరాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంలోని లోపాలన్నీ ఉన్నతాధికారులను కాపాడేందుకేనని, రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
