
తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్
అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘనవిజయాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం తన లోక్‌సభ నియోజకవర్గమైన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బెంగాల్‌లో వీచిన కాషాయ గాలి త్వరలోనే తెలంగాణను తాకి పెనుతుఫానుగా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలతో దేశంలో 'ఇండియా' కూటమి ముక్కలైందని సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆ కూటమిని ఏకతాటిపై ఉంచలేరని ఎద్దేవా చేశారు. అస్సాం నుంచి వీచిన కాషాయ గాలి బెంగాల్‌ను తాకింది. అది ఇప్పుడు తెలంగాణ వైపు వస్తోంది. ఈ గాలుల ధాటికి తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్‌లో హిందూ సమాజం ఏకమై బీజేపీకి అండగా నిలిచినట్లే, తెలంగాణలోనూ హిందూ ఓటు బ్యాంక్ బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లో లాగే తెలంగాణలోనూ గోరక్షకులపై దాడులు, ధర్మానికి విరుద్ధమైన పనులు జరుగుతున్నాయని, వీటన్నింటికీ ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చెబుతారని అన్నారు. ఉత్తర-దక్షిణ విభజనను సృష్టించాలని చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు
కేరళలో యూడీఎఫ్ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు 'గేమ్ ఛేంజర్' అని కొనియాడటంపై సంజయ్ మండిపడ్డారు. కేరళ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ పేరు తొమ్మిదో స్థానంలో ఉంది. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి, ఇక్కడి సొమ్మును కేరళలో ఖర్చు చేశారు అని ఆరోపించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించలేదని గుర్తు చేశారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి పరాయి రాష్ట్రాల్లో తిరగడం మానేసి ఇక్కడి సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, ఒక భూమి వివాదంలో తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన సంజయ్.. ఆ ఆరోపణలకు సంబంధించి 48 గంటల్లోగా ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. చివరగా, ఈ నెల 10న హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
