Let's talk: editor@tmv.in
‘బస్సులో భరోసా’.. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ నిఘా

‘బస్సులో భరోసా’.. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ నిఘా

Gaddamidi Naveen
25 మే, 2026

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల రక్షణ కోసం, ముఖ్యంగా మహిళా భద్రత కోసం ఒక వినూత్నమైన ప్రాజెక్టును చేపట్టింది. "బస్సులో భరోసా" పేరుతో పోలీసు శాఖ సమన్వయంతో రూపొందించిన ఈ సరికొత్త భద్రతా నిఘా వ్యవస్థను తొలి విడతగా ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చారు. దీని ద్వారా బస్సులోని ప్రతీ ప్రయాణికుడి కదలికలు 24 గంటల పాటు నిరంతర నిఘా నీడలో ఉండనున్నాయి.

బస్సులోని ప్రతి అంగుళాన్ని కవర్ చేసేలా ఈ కెమెరాలను ప్రత్యేక సాంకేతికతతో అమర్చారు. డ్రైవర్ క్యాబిన్, మహిళలకు కేటాయించిన ప్రత్యేక సీట్లు, ఫుట్‌బోర్డులు (మెట్లు) బస్సు చివరి సీటు వరకు ఈ కెమెరాల నిఘా ఉంటుంది. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే చిన్నపాటి యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి. ఈ కెమెరాల తాలూకు విజువల్స్ కేవలం బస్సులోని డ్రైవర్, కండక్టర్లకు మాత్రమే కాకుండా, నేరుగా ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు కూడా అనుసంధానించబడ్డాయి. దీనివల్ల కంట్రోల్ రూమ్ సిబ్బంది నిరంతరం బస్సులను పర్యవేక్షిస్తుంటారు. ఫలితంగా బస్సుల్లో తిరిగే దొంగల ముఠాలను, అనుమానాస్పద వ్యక్తులను వెంటనే గుర్తించి అప్రమత్తం చేయవచ్చు. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా ప్రమాదం జరిగితే, తక్షణమే ఖచ్చితమైన ఆధారాలను సేకరించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మహిళలు, వృద్ధులకు కొండంత అండ

మహిళా ప్రయాణికులపై జరిగే వేధింపులు, దొంగతనాలు, అసభ్య ప్రవర్తన వంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడానికి టీజీఎస్‌ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో దూరప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు ఈ నిఘా నేత్రాల ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ప్రారంభమైన ఈ భద్రతా కవచాన్ని, రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సులకు విస్తరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.