
నేటి నుంచే ‘రైతు గోస - బీజేపీ భరోసా’ యాత్ర
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహాన్ని నిలదీసేందుకు నేటి (సోమవారం) నుంచి క్షేత్రస్థాయిలో ‘రైతు గోస - బీజేపీ భరోసా’ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర నేపథ్యంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చూస్తే కనీసం 24 శాతం కంటే తక్కువగానే కొనుగోళ్లు జరిగాయని, ప్రభుత్వ నకిలీ వాదనలు పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. దగా పడ్డ తెలంగాణ రైతాంగం తరఫున పోరాడేందుకే ఈ యాత్రను చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వరి, మొక్కజొన్న పంట కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులకు అండగా కొనుగోలు కేంద్రాల వద్ద నిరసనల్లో పాల్గొని, రైతులతో మాట్లాడి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావుతో పాటు రాష్ట్ర పదాధికారులు, కిసాన్ మోర్చా ప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
