Let's talk: editor@tmv.in
వికారాబాద్ జిల్లాలో 'రైతు వారోత్సవాలు' ప్రారంభం
వికారాబాద్ జిల్లాలో 'రైతు వారోత్సవాలు' ప్రారంభం

వికారాబాద్ జిల్లాలో 'రైతు వారోత్సవాలు' ప్రారంభం

Gaddamidi Naveen
5 మే, 2026

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాలనలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరులో 'రైతు వారోత్సవాల'ను ఘనంగా ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వారోత్సవాలు మే 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా కొనసాగుతాయని ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటివరకు వారి ఖాతాల్లో రూ.1.40 లక్షల కోట్లు జమ చేసిందని వెల్లడించారు. తాండూరు ప్రాంత రైతులకు వరప్రదాయిని అయిన కొత్తపల్లి ప్రాజెక్టు కోసం రూ.90 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ముందుచూపుతో వ్యవహరించకపోతే భవిష్యత్తులో వ్యవసాయ భూముల ఉత్పాదకత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే సాగు విధానాల వైపు రైతులు మళ్లాలని సూచించారు. సేంద్రియ సాగును ప్రోత్సహిస్తూ, సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా భూసారాన్ని కాపాడుకోవడం అత్యవసరమని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా సహజ వ్యవసాయం దోహదపడుతుందని పేర్కొన్నారు. భూసార పరిరక్షణకు సంబంధించిన శాస్త్రీయ సూచనలను శాస్త్రవేత్తలు రైతులకు అందిస్తారని తెలిపారు.

రాష్ట్రంలో మొక్కజొన్న ఉత్పత్తి 40 వేల నుంచి 50 వేల క్వింటాళ్ల మధ్య ఉంటోందని, దేశంలో అత్యధికంగా మొక్కజొన్న పండించే రైతుల్లో తెలంగాణ రైతులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తోందని కూడా చెప్పారు. భూసార నిర్వహణ, సమతుల్య ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయంపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రైతు లావణ్య రెడ్డితో కలిసి మంత్రి టీజీ ఆన్‌లైన్ యాప్‌ను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను పరిశీలించారు.

తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నెముక అని, వ్యవసాయం భారం కాదు.. అదొక వేడుక అని పేర్కొన్నారు. మార్కెట్ అభివృద్ధి కోసం రూ.14,000 కోట్లు కేటాయించారని, జిల్లాకు ఆయిల్ పామ్ కంపెనీని కేటాయించినట్లు తెలిపారు. అలాగే తాండూరు కందికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఇక్కడ కంది బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ, ఈ వారోత్సవాల్లో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు రైతుల నుంచి సలహాలు, సూచనలు సేకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మున్సిపల్ ఛైర్మన్లు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.