Let's talk: editor@tmv.in
ఉక్రెయిన్ మీదుగా స్లోవేకియాకు రష్యా చమురు సరఫరా పునఃప్రారంభం

ఉక్రెయిన్ మీదుగా స్లోవేకియాకు రష్యా చమురు సరఫరా పునఃప్రారంభం

Shaik Mohammad Shaffee
24 ఏప్రిల్, 2026

గత మూడు నెలలుగా నిలిచిపోయిన రష్యా చమురు సరఫరా ఎట్టకేలకు పునః ప్రారంభమైంది. ఉక్రెయిన్ భూభాగం గుండా వెళ్లే ‘ ద్రుజ్బా ’ పైప్‌లైన్ ద్వారా స్లోవేకియాకు చమురు సరఫరా గురువారం తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్లోవేకియా ఆర్థిక మంత్రి డెనిసా సకోవా అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామం ఐరోపా రాజకీయాల్లో ఉన్న ప్రతిష్టంభనను తొలగించడమే కాకుండా, యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌కు అందాల్సిన భారీ ఆర్థిక ప్యాకేజీకి మార్గం సుగమం చేసింది.

ఏమిటీ వివాదం?

ఈ ఏడాది జనవరిలో రష్యా నుంచి హంగేరీ, స్లోవేకియాలకు వెళ్లే ద్రుజ్బా పైప్‌లైన్ దెబ్బతినడంతో చమురు సరఫరా నిలిచిపోయింది. రష్యా డ్రోన్ దాడుల వల్లే పైప్‌లైన్ పాడైందని ఉక్రెయిన్ వాదించగా.. ఉక్రెయిన్ కావాలనే మరమ్మతులు చేయడంలో ఆలస్యం చేస్తోందని హంగేరీ, స్లోవేకియాలు ఆరోపించాయి. ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌కు ఇవ్వాలనుకున్న 90 బిలియన్ యూరోల (సుమారు రూ.9 లక్షల కోట్లు) రుణాన్ని హంగేరీ అడ్డుకోగా, రష్యాపై కొత్త ఆంక్షలను స్లోవేకియా వ్యతిరేకిస్తూ వచ్చింది.

రాజకీయ చదరంగంలో 'చమురు' అస్త్రం

స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఈ పరిణామంపై స్పందిస్తూ.. పైప్‌లైన్ అసలు పాడైందనే విషయాన్ని తాను నమ్మడం లేదని, భూభాగ రాజకీయ యుద్ధంలో చమురును ఒక ఆయుధంగా వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు హంగేరీ మాజీ ప్రధాని విక్టర్ ఓర్బన్ సైతం గతంలో ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉక్రెయిన్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఏప్రిల్ 12న జరిగిన ఎన్నికల్లో ఓర్బన్ ఘోర పరాజయం పాలుకావడం, తాజాగా సరఫరా పునరుద్ధరణ జరగడం గమనార్హం.

ముగిసిన ప్రతిష్టంభన

స్లోవేకియా, హంగేరీ దేశాలు తమ ఇంధన అవసరాల కోసం ఇప్పటికీ రష్యాపైనే ఆధారపడుతున్నాయి. తాజాగా చమురు రాక మొదలవ్వడంతో, ఉక్రెయిన్‌కు సాయం అందించే విషయంలోనూ, రష్యాపై కొత్త ఆంక్షలు విధించే విషయంలోనూ ఈ రెండు దేశాలు తమ మొండిపట్టును వీడే అవకాశం ఉంది. "మంచి సంబంధాలు నెలకొంటాయని ఆశిస్తున్నాం" అంటూ స్లోవేకియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఐరోపాలో సద్దుమణిగిన ఉద్రిక్తతలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.